బెయిల్ స్కాం కేసులో అదనపు చార్జిషీట్ | Sakshi
Sakshi News home page

బెయిల్ స్కాం కేసులో అదనపు చార్జిషీట్

Published Thu, Jan 15 2015 12:16 AM

Additional charge sheet in the case of bail Scam

సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో బెయిల్ పొందేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి ముడుపులిచ్చారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు కోర్టులో ఇటీవల ఓ అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. జనార్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయించే క్రమంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న గాలి సోమశేఖర్‌రెడ్డి, రౌడీషీటర్ యాదగిరి, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ తదితరులు..

తమ సన్నిహితులు, తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, బంధువుల పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని, వాటి ద్వారా సంభాషణలు జరిపేవారని ఏసీబీ చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఎవరెవరి పేర్లతో సిమ్ కార్డులు పొందారో వారి వాంగ్మూలాలను నమోదు చేసి ఆ వివరాలను చార్జిషీట్‌లో పొందుపరిచారు.

రౌడీషీటర్ యాదగిరి వద్ద పనిచేసే కారు డ్రైవర్ రాము, సోమశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకులు సునీల్‌కుమార్‌రెడ్డి, జి.రాజశేఖర్, నాగరాజు తదితరుల వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. వీరిలో కొందరు తమ గుర్తింపు కార్డులతోపాటు దరఖాస్తులపై సంతకాలు తీసుకున్నారని చెప్పగా, మరికొందరు తమకు అసలు ఫోన్లే లేవని చెప్పారు. బ్యాంకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారుల వాంగ్మూలాలను కూడా ఏసీబీ నమోదు చేసింది.
 

Advertisement
Advertisement