మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు

Accused Arrested In Women Murder Case - Sakshi

నిందితులు కొన్నంగుంట వాసులు 

డీఎస్పీ బి.శ్రీనివాసరావు

నూజివీడు: మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద నల్లబెల్లి గ్రామానికి చెందిన పిల్లా కమలకు ఆరేళ్ల క్రితం క్రాంతి కుమార్‌తో వివాహమైంది. వీరిరువురికి ఆరు సంవత్సరాల కుమార్తె ఉంది. అయితే మూడేళ్ల క్రితం భర్తను వదిలేసిన కమల అప్పటి నుంచి హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ ఏరియాలో నివాసం ఉంటూ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది.

ఏడాది క్రితం కృష్ణాజిల్లా నూజివీడు మండలం బోర్వంచ శివారు కొన్నంగుంటకు చెందిన పామర్తి పూర్ణ శ్రీకాంత్, హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటుండగా ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె పరిచయం ఏర్పడింది. తాను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నానని, తనకు ఆస్తులున్నాయని, ఇంకా పెళ్లి కాలేదని  పరిచయం చేసుకుంది. దీంతో శ్రీకాంత్‌ కూడా ఆమెకు దగ్గరై సహజీవనం చేశాడు. 

కమల సొంత ఊరుకి వెళ్తే..

గత సంక్రాంతి పండుగ సమయంలో కమల స్వగ్రామానికి ఇద్దరూ కలసి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెకు వివాహమైందని, భర్తను వదిలేయడమే కాకుండా కుమార్తె కూడా ఉందని శ్రీకాంత్‌కు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అతడు ఆ తరువాత నుంచి ఆమెతో ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కమల రెండు సార్లు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను వదిలిపెడితే ఊరుకోనని బెదిరించింది.

వదిలించుకోవాలని..

రోజురోజుకు కమల వేధింపులు ఎక్కువవుతుండడంతో ఎలాగైనా వదిలించుకోవాలని శ్రీకాంత్‌ నిర్ణయించుకున్నాడు. తండ్రి పామర్తి శోభనబాబును సహకరించాలని కోరాడు. తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో శ్రీకాంత్‌ అమ్మమ్మగారి ఊరైన చాట్రాయి మండలం పర్వతాపురంలో దినం కార్యక్రమం ఉందని, వెళ్లివద్దామని నమ్మించి గతనెల 28 రాత్రి 9గంటలకు హైదరాబాద్‌లో కమలను బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. దారిలో కీసర వద్ద పెట్రోలు కోని సీసాలో నింపుకుని తీసుకుని మండలంలోని అన్నేరావుపేట రోడ్డులోకి తీసుకెళ్లి చున్నీతో మెడకాయకు చుట్టి గట్టిగా లాగి చంపేసి,  రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి లాగి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ తరువాత నేరుగా విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. 

దర్యాపులో నిజాలు..

కాలిన మృతదేహాన్ని తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు కమల చేతికి ఉన్న వాచ్‌ తెల్లవారుజామున 3.50గంటలకు ఆగిపోయి ఉంది. అదే రోజు రాత్రి ఒంటి గంట వరకు వర్షం జల్లులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒంటి గంట నుంచి 3.50గంటల మ«ధ్యే ఘటన జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని గుర్తించారు. అలాగే చంపేయమని సలహా ఇచ్చిన నిందితుడి తండ్రి శోభన్‌బాబు, తల్లి పుణ్యవతిని నిందితులుగా కేసులో నిందితులుగా చేర్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును 36 గంటల్లోనే చేధించారు.  నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు 15రోజులు రిమాండ్‌ విధించింది. విలేకరుల సమావేశంలో సీఐ మిద్దే గీతారామకృష్ణ, రూరల్, టౌన్‌ ఎస్‌ఐలు కే దుర్గాప్రసాదరావు, రంజిత్‌కుమార్, రూరల్‌ ఏఎస్‌ఐ  రాధాకృష్ణరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top