ఆస్తుల క్రయవిక్రయాలకు నెలవైన రిజిస్ట్రార్ కార్యాలయాలు.. అక్రమార్జనకు నిలయాలన్న నిజం..అవినీతి నిరోధకశాఖ సెంట్రల్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ఆస్తుల క్రయవిక్రయాలకు నెలవైన రిజిస్ట్రార్ కార్యాలయాలు.. అక్రమార్జనకు నిలయాలన్న నిజం..అవినీతి నిరోధకశాఖ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందం రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గురువారం జరిపిన దాడితో మరోసారి రుజువైంది. ఈ దాడిలో సుమారు రూ.1,70,000 లంచపు సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాదరావు చెప్పారు. ఇద్దరు రిజిస్ట్రార్లను, క్రయవిక్రయదారుల నుంచి ఈ సొమ్ములు అనధికారికంగా తీసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఏడుగురు ప్రైవేటు వ్యక్తులను, 17 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు.
భీష్మ ఏకాదశి సందర్భంగా ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయని అందిన సమాచారం మేరకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం డీఎస్పీ ప్రసాదరావు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో స్థానిక సాయికృష్ణా థియేటర్ సమీపంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ఏడుగురు వ్యక్తులతో పాటు, డాక్యుమెంట్ రైటర్లు, కార్యాలయ సిబ్బంది వద్ద ఉన్న లంచం ఇచ్చేందుకు, లంచంగా తీసుకున్న నగదు సుమారు రూ.1,70,000 స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్‌లు ఎం.జీవన్‌బాబు, సీహెచ్ శ్రీనివాసబాబులను; కార్యాలయంలో సిబ్బందితో పాటు మామూళ్ళు వసూలు చేసేందుకు, ఇతర పనులకు అనధికారికంగా రోజుకి రూ.500 ఇచ్చే పద్ధతిన పనిచేస్తున్న వి.నాగమురళి, డి.ప్రసాద్, ఎం.విక్టర్ జాన్‌మిల్టన్, నరసయ్య గాంధీ, రాజేష్, విజయ్‌గోపాల్, వెంకటేశ్వరరావుతో పాటు 17మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు మధ్యవర్తుల సమక్షంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి నిర్వహించగా లంచాల రూపంలో ఇచ్చిన రూ.1,70,000 పట్టుబడిందని డీఎస్పీ చెప్పారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న వారిపై చర్యలు ఉంటాయన్నారు. దాడిలో ఇన్‌స్పెక్టర్‌లు ఎం.రమేష్, బి.సుదర్శనరావు, ఎస్‌కే గఫూర్ పాల్గొన్నారు.