ఏసీబీ దాడులు.. నగదు స్వాధీనం

ACB Officials Raided The Stamps And Sub Registrar Office In Guduru On Monday Afternoon - Sakshi

రూ.1.39 లక్షల స్వాధీనం

అవినీతిపై ఫిర్యాదులతోనే దాడులు చేశాం : ఏసీబీ డీఎస్పీ  

సాక్షి, గూడూరు: గూడూరులోని స్టాంప్స్‌ అండ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్కసారిగా ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ శాంతో, సీఐలు కార్యాలయంలోకి ప్రవేశించి తలుపులు మూసేసి తనిఖీలు చేపట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సుమారు రెండు గంటలకు పైగా సోదాలు చేసిన ఏసీబీ అధికారులు లెక్కల్లో లేని రూ.1,39,150 స్వాధీనం చేసుకున్నారు. అలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ భానుమతి వద్ద ఎవరెవరికి ఎంత నగదు చెల్లించాలన్న విషయాలు రాసి ఉన్న ఒక స్లిప్‌ దొరికిందని, దానిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ వివరాలను వెల్లడించారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూములు, ఇళ్లు ఇతర ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు చేసే వారి నుంచి భారీఎత్తున లంచాలు తీసుకుంటున్నారని బాధితుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక దాడులు చేసినట్లు చెప్పారు. ఇంకా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం సిబ్బందితోపాటు సోమవారం రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వచ్చిన వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అవినీతి జరుగుతుందని బాధితులు ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట సీఐలు రమేష్‌బాబు, శ్రీహరి, సిబ్బంది ఉన్నారు.

పొలం విషయమై..
గూడూరు రూరల్‌ పరిధిలోని ఓ గ్రామంలో పొలానికి సంబంధించిన విషయమై బాధితులు వారంరోజులుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వారి పని చేసేందుకు పెద్ద మొత్తం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందని, ఈక్రమంలోనే దాడులు జరిగాయని తెలుస్తోంది. కాగా అధికారులు ఇంకా రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గూడూరు జిల్లా రిజిస్ట్రార్‌ గంగిరెడ్డిని పిలిపించి విచారించారు. ఇదిలా ఉండగా కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడుల విషయం పట్టణంలో చర్చనీయాంశమైంది. కొందరు బాధితులు ‘తమ వద్ద ఇంత తీసుకున్నారని.. మమ్మల్ని ఇంత డిమాండ్‌ చేశారని.. నగదు ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీ పెడతారనే భయంతో డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నాం’ అని కొందరు బాహాటంగానే చెప్పుకొచ్చారు.   

మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ శాంతో 

తీరు మారలేదు
గూడూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై పలు పర్యాయాలు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అయినా కార్యాలయ సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదు. చిన్న పని కూడా చేయకుండా, రైటర్ల ద్వారా బేరసారాలు కుదుర్చుకుని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top