నోబెల్‌ విజేత గుంటూరు వచ్చారు!

Abhijit Banerjee Visit Guntur in 2006 - Sakshi

సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి విజేత అభిజిత్‌ బెనర్జీ పరిశోధనల కోసం గతంలో గుంటూరులో పర్యటించిన విషయం వెలుగులోకి వచ్చింది. 2006 అక్టోబరులో ‘ది ఎకనమిక్‌ లైవ్స్‌ ఆఫ్‌ ది పూర్‌’ పేరిట ప్రచురించిన పరిశోధనా పత్రంలో గుంటూరులో పేద మహిళల జీవన స్థితిగతులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. రోజుకు ఒక డాలర్‌ కంటే తక్కువ సంపాదనతో బతుకీడుస్తున్న వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసి, పేదరికాన్ని జయించగలిగే మార్గాలను అన్వేషించడానికి వీలుగా 13 దేశాల్లో డేటాను ఆయన తన సహచర పరిశోధకురాలు ఎస్తేర్‌ డఫ్లోతో కలిసి సేకరించారు.

అందులో ఏమని రాశారంటే.. ‘ఉదయం 9 గంటలకు పేదరికం తాండవిస్తున్న వీధికి వెళ్లాం. తమ ఇళ్ల ముందు మహిళలు దోసెలు వేసి విక్రయిస్తున్న దృశ్యం కనిపించింది. ప్రతి ఆరో ఇంటివద్ద ఇది కనిపించింది. ఒక్కో దోసె రూ. 1కి విక్రయిస్తున్నారు. ఒక గంట తర్వాత మళ్లీ ఆ వీధిలో వెనక్కి వచ్చాం. దోసెలు వేస్తున్న వారంతా కట్టేసి వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న ఒక మహిళతో మాట్లాడితే... దోసెలు అమ్మిన తర్వాత రోజంతా ఖాళీగా ఉండకుండా మరో పని చేస్తాం. నేను చీరలు విక్రయిస్తాను అని తెలిపారు. ఒకే పని చేసి, దాంట్లోనే నైపుణ్యం, అనుభవం సంపాదిస్తే మెరుగైన సంపాదన ఉంటుంది కదా? అని అడిగిన ప్రశ్నలకు మహిళల నుంచి వచ్చిన సమాధానాలు వివిధ రకాలుగా ఉన్నాయి. దోసెల పని అయిన తర్వాత రోజంతా ఖాళీగా ఉండటం ఎందుకని మరో పనిచేస్తున్నామని కొందరు చెప్పారు.

ఒకే పని(వ్యాపారం) చేస్తే నష్టభయం ఉంటుందని, రెండు–మూడు రకాల పనులు చేయడం వల్ల నష్టభయం తక్కువగా ఉంటుందని మరి కొందరు చెప్పారు.  ‘దోసెలు వేయడం వల్ల పెద్దగా లాభం రావడం లేదని గమనించాం. దోసెలు తయారీకి ఉపయోగించే పొయ్యి, ఇతర వస్తువులన్నీ ఇంట్లోవే. అందువల్ల పెట్టుబడి అవసరం లేదు. నష్టమూ తక్కువే. అందుకే ఎక్కువ మంది ఈ పనిచేస్తున్నారు’ అని పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు. తాము హైదరాబాద్‌ను కూడా సందర్శించినట్లు పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. (చదవండి: పేదరికంపై పోరుకు నోబెల్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top