ప్రైవేట్ మెస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు.
* ఏఎన్‌యూలో ఇంజినీరింగ్ విద్యార్థుల ధర్నా
* ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు
* అధికారులతో వీసీ సమీక్ష
* గురువారం నుంచి యూనివర్సిటీ మెస్ ఇవ్వాలని నిర్ణయం
ఏఎన్‌యూ : ప్రైవేట్ మెస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ప్రైవేట్ మెస్‌ను కొనసాగిస్తున్నందుకు నిరసనగా వర్సిటీ పరిపాలనా భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు విద్యార్థులతో మాట్లాడారు. మెస్ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, నిరసన విరమించాలని సూచించారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.
నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకోలేదు
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు కల్పిస్తున్నట్టే యూనివర్సిటీ మెస్ సౌకర్యాన్ని తమకు కూడా కల్పించాలని పలుమార్లు కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రైవేట్ మెస్ విధానం రద్దు చేయూలని కోరుతూ నెలల తరబడి తిరుగుతున్నా ప్రయోజనం లేకపోరుుందన్నారు. మూడు రోజుల క్రితం ఉన్నతాధికారులను కలిసినపుడు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ తర్వాత రోజే ప్రైవేట్ మెస్ మంత్లీ కార్డులు తీసుకోవాలని సూచనలు చేయటమేంటని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఈ.శ్రీనివాసరెడ్డి తదిత రులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు.
అధికారులతో వీసీ సమీక్ష
ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మెస్ విధానంపై వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు సాయంత్రం అధికారులతో సమీక్ష జరిపారు. రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీనివాసరెడ్డి, పరిశోధకుల వసతి గృహాల వార్డెన్ డాక్టర్ కె.మధుబాబు, బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ డాక్టర్ త్రిమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే గురువారం నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా యూనివర్సిటీ మెస్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.