పెళ్లి అయిన 40 రోజులకే..


  •     విధినిర్వహణలో గుండెపోటుతో హోంగార్డు హఠాన్మరణం

  •      తిరుమలలో విషాదం

  • సాక్షి, తిరుమల : పెళ్లి అయిన నలభై రోజులకే టీటీడీ హోంగార్డు జె.సురేంద్ర(30) విధులు నిర్వహిస్తూ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన తిరుమలలోని టీటీడీ ఉద్యోగులలో విషాదం నింపింది. వివరాలిలా..

     

    పాపానాయుడు పేటకు చెందిన జె.సురేంద్ర(30) టీటీడీ విజిలెన్స్ విభాగంలో మూడవ సెక్టార్ పరిధిలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. గతనెల 11వ తేదీన ఆలయ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రామ్మూర్తి కుమార్తెతో సురేంద్రకు వివాహమైంది. సురేంద్ర శ్రీవారిమెట్టు మార్గంలో నడచివచ్చే భక్తులకు టోకెన్లపై చేతి స్టాంపు ముద్రించే విధుల కోసం శుక్రవారం ఉదయం 6 గంటలకు వెళ్లాడు.



    మధ్యాహ్నం ఒంటిగంటకు 350 మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకుని భోజనం చేసి తిరిగి మెట్లమార్గం ద్వారా అక్కడికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో తలకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సహచర సిబ్బందితో పాటు భక్తులు సురేంద్రను చేతులపై మోసుకుని తిరుమలకు తీసుకొచ్చి అంబులెన్స్ ద్వారా అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.



    రెండు రోజులుగా ఛాతీనొప్పితో సురేంద్ర  బాధపడేవాడని, శుక్రవారం ఉదయం నుంచే నొప్పిగా ఉందని పలుమార్లు చెప్పాడని విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది తెలిపారు. తలకు గాయం కావడంపై టూ టౌన్ ఎస్‌ఐ వెంకటరమణ దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ సీవీఎస్‌వో ఘట్టమనేని శ్రీనివాసరావు, ఏవీఎస్‌వోలు సాయిగిరిధర్, కోటేశ్వరరావు మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. నిరుపేద కుటుంబానికి చెందిన సురేంద్ర హఠాన్మరణం బాధాకరమని, మృతుని సతీమణిని టీటీడీ ఆదుకోవాలని అధికారులు కోరారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top