మృత్యు తీగలు

4 dies in kurnool district due to current shock

సంజామల: అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించుకోవడానికి పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం మిక్కినేనిపల్లెలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. విద్యుత్‌ షాక్‌కు గురై ఉప్పరి సుధాకర్‌ (22), షేక్‌ సుకుర్‌ బాషా (35)తో పాటు పదోతరగతి విద్యార్థిని ప్రవల్లిక (15) మృతి చెందింది. ఉప్పరి మద్దమ్మ, రజిత అనే మరో ఇద్దరు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మిక్కినేనిపల్లెకు చెందిన ఉప్పరి సుధాకర్‌ మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సీడు పత్తి సాగు చేశాడు. ఇతని మేనమామ లకు‡్ష్మడు కూడా సుధాకర్‌ పొలం పక్కనే తనకున్న ఎకరా పొలంలో పత్తివేశాడు.

అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ జీఏవైరు అమర్చి రోజూ సాయంత్రం కరెంట్‌ ఇచ్చి మరుసటి రోజు ఉదయమే తొలగించేవారు. వీరి పొలానికి కాస్త దూరంలో షేక్‌ సుకుర్‌ బాషా కూడా తనకున్న ఎకరా  పొలంలో పత్తి సాగు చేస్తు న్నాడు. అయితే.. గురువారం కరెంట్‌ వదిలిన ఉప్పరి సుధాకర్‌ తర్వాత దాన్ని తొలగించడం మరచిపోయాడు. ఆ క్రమంలోనే సుధాకర్‌ శుక్రవారం ఉదయం పది మంది కూలీలతో పొలానికి వెళ్లి పత్తి విడిపించే (సేకరణ) పనిలో నిమగ్నమయ్యారు. తన పొలానికి వచ్చిన షేక్‌ సుకుర్‌బాషా  బిందెతో పక్క పొలంలోని బోరు నుంచి నీరు తెచ్చుకుంటూ సుధాకర్‌ పొలం వద్ద విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అక్కడ పనిచేస్తున్న ఎవరూ దీనిని గుర్తించలేదు. 

తన పొలంలోని తీగలు తగిలి..
బాషా మృతిచెందిన కొద్దిసేపటి తర్వాత సుధాకర్‌ మేనమామ తల్లి మద్దమ్మ, కుమార్తెలు ప్రవల్లిక, రజిత కూడా తమ పొలంలో పత్తి విడిపించేందుకు వెళ్లారు. మద్దమ్మ, రజితలకు కరెంటు తీగలు తగిలి షాక్‌కు గురవ్వగా వీరిని ప్రవల్లిక కట్టె సాయంతో రక్షించింది. వారిద్దరూ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. తర్వాత కరెంట్‌ తీగను పక్కకు నెట్టే క్రమంలో ప్రవల్లిక విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయింది. ఇది చూసి మద్దమ్మ గట్టిగా కేకలు వేయగా పక్క చేలో ఉన్న సుధాకర్‌ పరుగున వచ్చే క్రమంలో అతని పొలంలోనే ఉన్న విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతి చెందిన సుకుర్‌బాషాకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సు«ధాకర్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఇతనికి సోదరుడు, తల్లి ఉన్నారు.  

మరో ఘటనలో... 
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామంలోనూ ఓ మహిళ విద్యుదాఘాతానికి గురయింది. గ్రామానికి చెందిన బోయ నాగమ్మ (55)కు 8 ఎకరాల పొలముంది. గ్రామ సమీపంలోని హంద్రీనది ఒడ్డున గల ఎకరా పొలములో వరి సాగు చేసింది. హంద్రీనదికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని వదలడంతో పొలం మునిగిపోయింది. శుక్రవారం నీటి విడుద లను అధికారులు నిలిపేయడంతో హంద్రీలో నీటి ఉధృతి తగ్గింది. దీంతో పొలాన్ని పరిశీలించేందుకు నాగమ్మ శుక్రవారం సాయంత్రం వెళ్లగా, అక్కడ బోరుకు సంబంధించిన కరెంట్‌ తీగలు కింద పడివుండటాన్ని గమనించి వాటిని పక్కకు తొలగించేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో తీగలకు సపోర్టుగా వేసిన ఇనుపవైరుకు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. 

విద్యుదాఘాతంతో  నలుగురు మృతిపై జగన్‌ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top