322వ రోజు పాదయాత్ర డైరీ

322th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం– 3,462.3 కిలోమీటర్లు
16–12–2018, ఆదివారం, జమ్ము, శ్రీకాకుళం జిల్లా.

యూనిఫామ్‌ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి బాబూ? 
ఉదయం నుంచి మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఎండ జాడే లేదు. తుపాను ప్రభావం ప్రారంభమైనట్టు ఉంది. అయినా భారీగా జనం నా అడుగులో అడుగు వేశారు.శ్రీకాకుళానికి చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిశారు. ‘సంవత్సరాల తరబడి స్కూల్‌ యూనిఫామ్‌ కుడుతున్నాం.. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం మా కడుపులు కొడుతోంది.. మేము ఎలా బతకాలి’ అంటూ మొరపెట్టుకున్నారు. దాదాపు వంద మందికి పైగా మహిళలు ఆ సంస్థలో ఉన్నారట. ‘బట్టలు కుడితే ఇచ్చే రూ.40లో రూ.10 ఆప్కో చైర్మన్‌కు లంచం ఇచ్చుకోవాల్సి వస్తోంది.. ఆ మిగతా డబ్బు కూడా సంవత్సరం పైగా చెల్లించకపోతే మా పరిస్థితి ఏం కావాలి?’ అంటూ ఆ అక్కచెల్లెమ్మలు బావురుమన్నారు. ‘ఈ పాలనలో ఆప్కో సంస్థ అక్రమాల పుట్టగా మారిపోయింది.. బడిపిల్లలకు ఉచిత యూనిఫామ్‌ పథకం అధ్వానంగా తయారైంది.. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా యూనిఫామ్‌ పూర్తిగా స్కూళ్లకు అందడం లేదు.. అరకొరగా ఇచ్చినవి కూడా నాసిరకమైనవే.. కొలతలు సరిగా లేనివి. ఓవైపు విద్యార్థులు వాటిని వేసుకోలేక మూలనపడేస్తుంటే.. మరోవైపు చాలీచాలని కొలతలతో కుట్టినవి వేసుకుంటూ విద్యార్థినులు సిగ్గుతో చితికిపోతున్నారు. అసలీ పథకం ఎవరి కోసం?’ అంటూ ఆ మహిళా సంఘం సభ్యులు మండిపడ్డారు. పేద పిల్లల స్కూల్‌ యూనిఫామ్‌ పథకాన్ని సైతం దోపిడీమయం చేసిన ఆప్కో చైర్మన్, సంబంధిత మంత్రి, ప్రభుత్వ పెద్దలే ఈ పథకం అసలైన లబ్ధిదారులంటూ చెప్పుకొచ్చారు.  

వంశధార నది వరద ముంపును నివారించాలని కరకట్టల నిర్మాణాన్ని చేపట్టారు.. నాన్నగారు. నిధులు కూడా మంజూరు చేశారు. కానీ పెండింగ్‌ పనులు కూడా పూర్తిచేయని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏటా వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయన్నది నరసన్నపేట రైతన్నల ఆవేదన. ‘నియోజకవర్గంలోని ఆరు ఓపెన్‌ హెడ్‌ చానల్స్‌ ఆధునికీకరణలోనూ అదే నిర్లక్ష్యం. ఆ పనులు పూర్తిచేయకపోవడంతో వరదలు వచ్చినప్పుడు వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు లేనప్పుడు సాగునీరు అందక ఎండిపోతున్నాయి’ అంటూ ఆ అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు. ఇలా ఏటా ఏదో ఒక రూపంలో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నా చీమకుట్టినట్టయినా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?  

కేవలం వైఎస్సార్‌ హయాంలో నియామకాలు పొందామన్న ఏకైక కారణంతో వేధింపులకు గురిచేస్తోంది ఈ ప్రభుత్వమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఆరోగ్యమిత్రలు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీరి ఉద్యోగాల పరిస్థితి దినదినగండంగా మారిందట. ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే కోర్టునాశ్రయించి న్యాయం పొందారట. జీతాలు పెంచాలని కోర్టు తీర్పు ఇస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదట. ‘ఇప్పటికీ మమ్మల్ని తీసేయాలనే చూస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ మన్ననలు పొందిన ఆరోగ్యశ్రీ పథకంలో మా నియామకాలు జరగడమే తప్పా సార్‌’ అంటూ వాపోయారు. నాన్నగారికి పేరొస్తుందేమోనన్న సంకుచితత్వంతో.. పేదలపాలిట సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీని నీరుగార్చడం, అందులో పనిచేసే చిరుద్యోగులను వేధించడం కన్నా అన్యాయం ఏముంటుంది? ఎవరి మీద ఈ ప్రభుత్వం కక్ష? అందులో పనిచేసే చిరుద్యోగులు, ఆ పథకం వల్ల లబ్ధి పొందే లక్షలాది పేద కుటుంబాలపైననా? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి సంవత్సరం విద్యార్థులందరికీ యూనిఫామ్‌ సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. కానీ వస్త్రం సరఫరా చేసిన చేనేత సొసైటీలు తమకు ఇప్పటిదాకా బకాయిలు చెల్లించనే లేదని వాపోతున్నాయి.. తమకు డబ్బులు ఇవ్వలేదని దుస్తులు కుట్టినవారు గగ్గోలు పెడుతున్నారు. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా ఇప్పటికీ కొన్ని స్కూళ్లకు యూనిఫామ్‌ అందడం లేదని, అందినవి కాస్తా నాసిరకమైనవని విద్యార్థులు చెబుతున్నారు. మరి ఈ పథకానికి ఖర్చు చేశామంటున్న వందల కోట్ల నిధులు ఏమవుతున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి?  
- వైఎస్‌ జగన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top