20 సంస్థలకు 120 ఎకరాలు!

120 acres for 20 companies - Sakshi

అమరావతిలో కేటాయిస్తూ మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో 20 సంస్థలకు 120 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో యనమల అధ్యక్షతన బుధవారం ఉపసంఘం సమావేశమైంది. సమావేశం అనంతరం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఆమోదించగా కొన్ని తిరిస్కరించినట్లు మంత్రులు తెలిపారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి 50 ఎకరాలు, అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలు, భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు 5.56 ఎకరాలు కేటాయించినట్లు మంత్రులు తెలిపారు.

ఈ భూములకు ఎకరాకు రూ.10 లక్షల నుంచి నాలుగు కోట్ల వరకు ధర నిర్ణయించినట్లు చెప్పారు.  నాబార్డుకు ఇచ్చే భూమి విలువను ఎకరాకు రూ.2 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. రామకృష్ణ మిషన్, ఉన్నత విద్యా శాఖ, ఏపీ ఫైబర్‌నెట్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఘం, అంతర్జాతీయ క్రికెట్‌ అకాడమీ, కెనారా బ్యాంకు, విజయా బ్యాంకు, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీస్, ఏపీ పబ్లిక్‌ లైబ్రరీస్, ఏపీ ఫైనాన్సియల్‌ సిస్టమ్‌ అండ్‌ సర్వీసెస్, అమరావతి ఎడ్యుకేషనల్‌ కల్చరర్‌ అకాడమీ తదితర ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు భూముల కేటాయింపు ధరలు నిర్ణయించినట్లు వారు తెలిపారు. గతంలో పది విభాగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు మొత్తం కలిపి 85 సంస్థలకు 1374.96 ఎకరాలను కేటాయించినట్లు వివరించారు. నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top