
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్న నేపథ్యంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సోమవారం అమరావతిలో సమావేశమవుతున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల్లో ప్రధానంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపులను సిఫార్సు చేయాలని ఉంది. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతాయని, ఏటా 8000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇదే తరహాలో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు నష్టపోనున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలన్నీ 2011 జనాభాకు బదులు 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం ఈ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఆర్థిక రంగ నిపుణులు సమావేశమై 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల కారణంగా ఏ విధంగా రాష్ట్రాలను అన్యాయం జరుగుతుంతో కూలంకుషంగా చర్చించనున్నారు. అనంతరం ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. 1971 జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 5.05 శాతంగా ఉంటుంది. అదే 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 4.09 శాతమే ఉంటుంది.
15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాలి: యనమల
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా రూపొందించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల కారణంగా దేశంలోని 11 రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. విభజన అనంతరం ఏపీకి రూ.16 వేల కోట్ల లోటు ఉన్నట్టు ఆర్‌బీఐ సహా అన్ని సంస్థలూ నివేదించాయని యనమల తెలిపారు. కేంద్రం ఇప్పటివరకూ రూ.4 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కేంద్ర పథకాలు 60:40 నిష్పత్తిలో అమలు చేస్తున్నారని దీని వల్ల రాష్ట్రాలపై 30 శాతం అదనపు భారం పడుతోందని అన్నారు.