108 వాహనం రాకనే ఆగిన ప్రాణం

108 Vehicle negligence Man Dies In Srikakulam - Sakshi

సకాలంలో వైద్యులు స్పందించక గిరిజనుడి మృతి

శ్రీకాకుళం, కొత్తూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహన సేవలను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కొత్త వాహనాలు  కొనుగోలు చేయకపోగా, పాత వాహనాలతో నెట్టుకు రావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.  ఫలితంగా సకాలంలో సేవలందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మండలంలోని దిమిలి పంచాయతీ పరిధి అమ్మన్నగూడకు చెందిన కందుల ఆఫీస్‌ (54) శనివారం రాత్రి ఆకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది.

వెంటనే 108కు ఫోన్‌ చేయగా, వాహనం మరమ్మతుల్లో ఉందని సమాధానం వచ్చింది. అయినప్పటికీ మరలా పలు దఫాలుగా ఫోన్‌ చేసినా కాల్‌ సెంటర్‌ సిబ్బంది స్పందించ లేదు. చివరకు వైఎస్సార్‌సీపీ నేత గోళ రామకృష్ణ మరోసారి కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి కనీసం ఆల్తి గిరిజన గ్రామంలో ఫీడర్‌ అంబులెన్స్‌(టూవీలర్‌ అంబులెన్స్‌) పంపించాలని కోరారు. చివరకు మూడు గంటలు ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు ఫీడర్‌ అంబులెన్స్‌ పంపించారు. ఇందులో ఆఫీస్‌ను కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో ఆస్పత్రికి చేర్చిన బాధితుడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఆస్పత్రి తలుపులు సకాలంలో తీయకపోవడంతోనూ, 108 సిబ్బంది నిర్లక్ష్యంతోనూ మృతి చెందినట్లు అతడి బంధువులు ఆందోళన చేశారు. మృతుడి భార్య  నీలమ్మ అనారోగ్యంతో రెణ్నెళ్ల క్రితమే మృతి చెందింది. వీరికి కుమారులు చిరంజీవి, శేషగిరి ఉన్నారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
108 వాహనాల నిర్వాహణపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంతోనే సకాలంలో సేవలందకపోవడంతో ప్రజలు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయని వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన ఆఫీస్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఐటీడీఏ పీవో విచారణ చేపట్టాలని కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top