108 సిబ్బంది అలసత్వం

108 Ambulance Staff Negligence on Pregnant Woman - Sakshi

108 సిబ్బంది అలసత్వం

అలస్యంగా వచ్చారని అడిగినందుకు ఆగ్రహం

ఐటీడీఏ పీవో, ఇతర అధికారులకు ఫిర్యాదు

విశాఖపట్నం, పెదబయలు (అరకులోయ): ఏ వేళలో ఫోన్‌ చేసినా సకాలంలో వచ్చి.. బాధితులను ఆస్పత్రులకు చేర్చి.. అపర సంజీవనిగా పేరు తెచ్చుకున్న 108 వాహనాలు ఇప్పుడు ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాయి. సకాలంలో రాకపోవడంతోపాటు.. కొంతమంది సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 టెక్నీషియన్, పైలట్‌ ఓ ఆదివాసీ బాలింత, పసికందు పట్ల స్పందించిన తీరు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. బాధితులు తెలిపిన వివరాలివి.. మండలంలోని అరడకోట గ్రామానికి చెందిన కొర్రా బాలయ్య భార్య సుందరమ్మ వారం రోజుల క్రితం ప్రసవించిన బిడ్డకు వాంతులు, విరోచనాలు అవుతుండడంతో పెదబయలు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడ స్టాఫ్‌ నర్స్‌ పరిశీలించి, పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

దీంతో ఆదివారం రాత్రి 7.30 గంటలకు 108 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే 15 నిమిషాల్లో వస్తామని చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. పెదబయలులోనే ఉండి తీరిగ్గా రాత్రి 9.30 గంటలకు వచ్చారు. అంతవరకు ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు ‘ఇంత ఆలస్యం అయితే ఎలా సార్‌.. పరిస్థితి విషమంగా ఉంది కదా’ అని 108 సిబ్బందిని ప్రశ్నించారు. దానికి వారు స్పందించి తీరు దారుణంగా ఉంది. ‘ప్రాణాలు పోతే పోనీయండి.. మేము భోజనం చేసి రావడంతో జాప్యం జరిగింది.. మీరు ఇలా అడిగితే ఎందుకు పాడేరు తీసుకుని వెళ్లాల’ని వారు దురుసుగా మాట్లాడారు. వాహనంలో ఎక్కించుకుని పీహెచ్‌సీ నుంచి మెయిన్‌ రోడ్డు వరకు తీసుకెళ్లి దించేశారు. దీంతో  స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులకు బాధితులు సమాచారం అందించారు. వారు వెంటనే పాడేరు ఐటీడీఏ పీవోతో మాట్లాడి పీహెచ్‌సీ అంబులెన్స్‌కు పంపించారు. పరిస్థితి విషమంగా ఉన్న పసికందును వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సి ఉన్నా ఉన్న పైలట్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితులతోపాటు వైఎస్సార్‌ సీపీ నాయకులు నాగేంద్ర, సింగ్, పూర్ణయ్య  కోరారు. పైలెట్‌ మద్యం సేవించి ఉన్నాడని బాధితులు ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top