108 ఉద్యోగి నిర్లక్ష్యం గాలిలో కలిసిన ప్రాణం

108 Ambulance Staff Neggligance Pregnent Woman Died - Sakshi

ఆత్మహత్యకు యత్నించిన గర్భిణి

సకాలంలో అందని వైద్యం  

ఆస్పత్రిలో మృతి

మదనపల్లె క్రైం: అత్యవసర సమయంలో ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాన్ని నిలబెట్టాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన మదనపల్లెలో గురువారం జరిగింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన 10 కుటుంబాల వారు మూడేళ్ల క్రితం మదనపల్లె మండలం సీటీఎంలోని ఓ క్వారీలో పనిచేసేందుకు వచ్చారు. వారిలో రామ్‌సింగ్, శాంతి దంపతులు ఉన్నారు. వీరికి కొడుకు ధరమ్‌సింగ్‌ (4) ఉన్నాడు. శాంతి రెండోసారి గర్భం దాల్చింది. భర్త తాగి ఇంటికి వస్తున్నాడని బుధవారం సాయంత్రం మందలించింది. అతను పట్టించుకోకపోవడంతో భర్తను భయపెట్టేందుకు ఆమె పురుగుల మందుతాగింది. ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. వారికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో 108ను ఆశ్రయించారు. ఆ సమయంలో 108 వాహనాలు అందుబాటులో లేవని హైదరాబాద్‌ నుంచి ఆర్గనైజర్‌ సమాచారం అందించారు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న వాల్మీకిపురం 108 సిబ్బంది భార్గవాచారిని తిరుపతికి తీసుకెళ్లాలని బాధితులు, ఆస్పత్రి సిబ్బంది కోరారు. అందుకు అతను నిరాకరించి ఖాళీ వాహనంతోనే వాల్మీకిపురం వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఆస్పత్రికి వచ్చిన మదనపల్లె 108 సిబ్బంది గర్భిణి శాంతిని తీసుకుని వాల్మీకిపురం 108 సిబ్బందికి అప్పగించారు. వారు తిరుపతికి తీసుకెళ్లారు. సుమారు 3 గంటలు ఆలస్యం కావడంతో శాంతి పరిస్థితి మరింత విషమించింది. రుయా వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతి మృతి చెం దింది. ఈ విషయమై 108 జిల్లా సూపర్‌వైజర్‌ లోకేష్‌ను వివరణ కోరగా సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మరో సారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top