104 కష్టాలు

104 Employees Suffering Wages Shortage YSR Kadapa - Sakshi

చంద్రన్న సంచార చికిత్స సిబ్బందికి ఇబ్బందులు

డిమాండు నెరవేర్చేవరకు విధులకు దూరం

సమ్మె బాట పట్టిన సిబ్బంది

సమ్మెను నిర్వీర్యం చేసేందుకు బాబు సర్కార్‌ ఎత్తుగడ

పోలీసు రక్షణలో...అద్దె డ్రైవర్లతో నడిచిన కొన్ని వాహనాలు

పలుచోట్ల ఆందోళనలు చేపట్టిన ఉద్యోగులు

సాక్షి కడప/కడప రూరల్‌ : చంద్రన్న 104 సంచార చికిత్సకు సంబంధించిన ఉద్యోగులకు కష్టమొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాం నుంచి పనిచేస్తున్నా వారిని ఇంతవరకు ప్రభుత్వం గుర్తించ లేదు. 104 వాహనాలను అనేక రకాల సమస్యలు వెంటాడుతున్నా.. ప్రజలకు మాత్రం ఇబ్బందులు రాకుండా చూసుకున్న సిబ్బందికి ఇబ్బంది వచ్చింది. కడుపు కాలిన వారు సమ్మెబాట పట్టడంతో వైద్య విధానం గాడితప్పింది. సమ్మెను నిర్వీ ర్యం చేసేందుకు ఏకంగా పోలీసుల సహకారంతో.. అద్దె డ్రైవర్లను నియమించి వాహనాలను నడపేందుకు యత్నించడంపై పలువురు సంచార వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా 22 సంచార చికిత్స వాహనాలు ఉండగా.. అందులో పనిచేస్తున్న దాదాపు 134 మంది ఉద్యోగులకు ‘ఉద్యోగ భద్రత’ కొరవడింది. దీంతో వారు ఆందోళన బాట పట్టారు. వెరసి గ్రామీణ వైద్యానికి గ్రహణం పట్టుకుంది.

2008 నుంచి పనిచేస్తున్నా..ఆదుకోని ప్రభుత్వం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో 2008 ఆగస్టులో దివంగత సీఎం వైఎస్సార్‌ 104 పేరుతో సంచార వాహనాలను  ప్రారంభించారు. నెలలో ఒక రోజు పల్లెలకు వెళుతూ.. వైద్య సేవలను అందిస్తూ ప్రజా మన్ననలు అందుకున్నారు. అయితే వైఎస్‌ మరణానంతర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో 104 సిబ్బంది వేదన వర్ణణాతీతంగా మారింది. జిల్లాలో 22 సంచార వాహనాలు ఉన్నాయి. ఒక వాహనానికి ఒకరి చొప్పున వైద్యుడు, నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్, డ్రైవర్‌ మొత్తం ఐదుగురు సిబ్బంది ఉంటారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల (రోడ్‌ మ్యాప్‌) ప్రకారం ఈ వాహనాలు నిర్దేశించిన గ్రామాలకు వెళతాయి. ఆ మేరకు వైద్యం కోసం ఒక వాహనం వద్దకు ఒక రోజుకు 100–150  మంది రోగులు (ఔట్‌ పేషెంట్స్‌) వస్తారు. ఇక్కడికి వచ్చే గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ)లో ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయో..దాదాపు అన్ని వైద్య సదుపాయాలు ఈ సంచార వాహనం ద్వారా లభించాలి. దీంతో గ్రామీణులు పట్టణాలకు రాకుండానే తమ ఇంటి ముంగిటనే వైద్యం పొందుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక 104 నిర్వహణ బాధ్యతలను 2016లో పెరమిల్‌ స్వాశ్య మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఎస్‌ఎంఆర్‌ఐ) కు అప్పగించడంతో పాటు చంద్రన్న 104 సంచార చికిత్సగా నామకరణం చేశారు.

సమ్మెలోకి సంచార వైద్య సిబ్బంది
జిల్లాలో పనిచేస్తున్న సంచార వైద్య సిబ్బంది మంగళవారం నుంచి వాహనాలు నిలిపివేసి ఆందోళనబాట పట్టారు. మైదుకూరులో చంద్రన్న సంచార 104 వైద్య సేవ కో ఆర్డినేటర్‌ రామచంద్రయ్యను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోవడంతో సమ్మెలోకి వెళ్లామని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

పోలీసుల ద్వారా.. అద్దె డ్రైవర్లతో...
సంచార వైద్య సేవ సిబ్బంది సమ్మెకు దిగడంతో ఈ సమ్మెను ఎలాగైనా నిర్వీర్యం చేయాలన్న ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా పోలీసుల ద్వారా 104 సంచార వైద్య వాహనాలకు అద్దె డ్రైవర్లను నియమించి కొన్నిచోట్లకు పంపినట్లు తెలియవచ్చింది. ఈ వ్యవహారంపై సమ్మె చేస్తున్న సిబ్బందితోపాటు నాయకులు మండిపడుతున్నారు.

చంద్రన్న సంచార 104 సిబ్బంది డిమాండ్స్‌
చంద్రన్న సంచార 104 వాహనాలను ప్రభుత్వమే నడపాలి.
2016 మే 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా జీఓ 151 ప్రకారం వేతనాలను చెల్లించాలి.
ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా డైలీ ఫుడ్‌ అలవెన్స్‌ను రూ. 150కు పెంచాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు సౌకర్యాలను కల్పించాలి
104లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్‌ చేయాలి. యాక్ట్‌ 2–94 ను తొలగించాలి.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
హెచ్‌ఎంవీ నిబంధనల ప్రకారం ని యామకాలు చేపట్టిన డ్రైవర్లకు ఆ నిబం« దనల ప్రకారమే వేతనాలు చెల్లించాలి.
11వ పీఆర్సీని ప్రారంభ తేదీ నుంచి వర్తింప చేయాలి.
వాహనాలలో మెరుగైన సేవల కోసం డేటాఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలి.
ఔషధి, వీహెచ్‌ఎస్‌డీ డేటా చేస్తున్న ఫార్మసిస్ట్, నర్స్‌లకు పీహెచ్‌సీలలో మాదిరిగా అదనపు పారితోషికం చెల్లించాలి.
వాహనాలకు ఆర్‌సీ, ఇన్సూరెన్స్, రోడ్‌ ట్యాక్స్, ఫిట్‌నెస్‌ కల్పించాలి. మరమ్మతులను పూర్తి స్థాయిలో చేయించాలి.
ప్రజలకు మరింతగా మెరుగైన సేవలను అందించడానికి చర్యలు చేపట్టాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top