breaking news
-
తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు!
తిరుపతి (మంగళం): మద్యం మత్తు వల్లే జరిగిందా? సెల్ఫీ కోసమే అంతటి సాహసానికి పూనుకున్నాడా? లేదంటే చావడానికే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా?.. తిరుపతి జూ పార్క్ దుర్ఘటనలో పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివే. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుర్జర్(38) జూ సందర్శనకు వెళ్లి.. సింహానికి బలి కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. కుటుంబ సభ్యుల్ని విచారిస్తేనే.. ఈ కేసు ముడి వీడుతుందని తిరుపతి పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, శ్రీ వేంకటేశ్వర జూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్జర్ గురువారమే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో సిబ్బంది వారిస్తున్నా వినకుండా.. సింహాల ఎన్‌క్లోజర్ వైపు వెళ్లే యత్నం చేశాడు. తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. కొంత దూరంలోని వాటర్‌ట్యాంక్ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అంతటితో ఆగకుండా.. వంద మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. జూలో మూడు సింహాలు ఉన్నాయి. వాటిల్లో దుంగాపూర్ అనే సింహం తనవైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించింది. అది తనవైపు రావడంతో భయంతో ఉలిక్కిపడ్డాడు. పక్కనే ఉన్న చెట్టెక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్ గుర్జర్ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం లాక్కెళ్లి చంపేసింది. సిబ్బంది గమనించి పరుగున వచ్చి సింహాన్ని బోనులో బంధించాడు. కానీ, ఈలోపే అంతా జరిగిపోయింది. ఎస్వీ జూ పార్క్ లో సింహం దాడిలో మృతి చెందిన ప్రహ్లాద్ గుల్జార్ డెడ్ బాడీ రుయా మార్చురీకి తరలించారు పోలీసులు. ఆధార్ కార్డు ఆధారంగా రాజస్థాన్‌లో ప్రహ్లాద్ కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే అంత ఎత్తులో ఉన్న కంచె ఎక్కి లోపలికి దూకేంత సాహసం చేయడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నా.. అంత ఎత్తును అంత చాకచక్యంగా దూకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రహ్లాద్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు సిబ్బంది చెప్పడం లేదు. పైగా శవ పరీక్షలో మద్యం తీసుకున్న ఆనవాళ్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రహ్లాద్ మానసిక స్థితి సరిగ్గా లేదా? లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉండి ఆత్మహత్యకు యత్నించాడా? అనే కోణంలోనూ విచారించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేశామని.. కుటుంబీకులు వస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. -
టీడీపీ కుట్ర బట్టబయలు.. షర్మిలపై అసభ్యకర పోస్టులు..
కడప అర్బన్: అసభ్య దూషణలతో ఫేక్ పోస్టులు పెడుతూ దీన్ని వైఎస్సార్ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు యత్నించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీడీపీ సానుభూతిపరుడైన పినపాల ఉదయ్ భూషణ్ ఫేస్బుక్లో జుగుప్సాకరంగా వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీతపై పోస్టింగ్‌లు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. బుధవారం కడపలో అదనపు ఎస్పీ (అడ్మిన్) లోసారి సుధాకర్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. సాక్ష్యాధారాలతో దొరికిపోయినప్పటికీ తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిందితుడు ఉదయ్ భార్య ఏకంగా విశాఖలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆరోపణలు చేయడం ఆ పార్టీతో వారి అనుబంధాన్ని రుజువు చేస్తోంది. ఒకవైపు షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్టు చదివిస్తూ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబు మరోవైపు తన శిష్య గణం ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టింగ్‌లకు పురిగొల్పుతున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎవరినైనా సరే తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని అవసరం తీరాక బురద చల్లడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానిస్తున్నారు. ఫేక్ అకౌంట్ సృష్టించి.. విశాఖపట్నంలోని మహారాణిపేట సామ్రాట్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న నిందితుడు పినపాల ఉదయ్ ఈ ఏడాది జనవరి 13వతేదీన పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. వైఎస్ఆర్ సోషల్ మీడియా సభ్యుడైన రవీంద్రారెడ్డి ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సదరు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి షర్మిల, సునీతపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు. తన పేరు, ఫోటోను వినియోగించి దుష్ప్రచారానికి పాల్పడటంపై రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 3న క్రైం.నెం. 45/2024 కేసు నమోదైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అదనపు ఎస్పీ (అడ్మిన్) లోసారి సుధాకర్ పర్యవేక్షణలో పులివెందుల డీఎస్పీ కేఎస్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐ సి.శంకర్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐలు శ్రీధర్‌నాయుడు, మధుమల్లేశ్వర్రెడ్డిలను రెండు బృందాలుగా విభజించి దర్యాప్తు ప్రారంభించారు. ఫేస్బుక్ డేటా బేస్ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేసి విశాఖకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్‌గా గుర్తించారు. టీడీపీకి వీరాభిమాని అయిన నిందితుడు పార్టీ తరఫున పలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపుల్లో అసభ్యకరమైన మెస్సేజ్‌లు, పోస్టులు పెడుతున్నట్లు నిర్ధారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి నివాసం వద్ద ఈనెల 13న అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన యాపిల్ ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్, అర్బన్ సీఐ శంకర్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐలు శ్రీధర్‌నాయుడు, మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ జీవన్‌రెడ్డి, పులివెందుల ఎస్ఐ అరుణ్‌రెడ్డి తదితర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ వ్యవహారంలో ఇతర కుట్రదారులెవరన్నది తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేపట్టారు. -
నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: నారాయణపై మరదలు ఫిర్యాదు
సాక్షి,నెల్లూరు: మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనను నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ప్రియ పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనను పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతకుముందు ముందు ప్రియ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వీరి చెర నుంచి తప్పించుకుని మరీ ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి.. ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా -
నెల్లూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురు మృతి
కావలి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావలిలోకి టోల్‌ప్లాజా వద్ద రెండు లారీ, ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటక రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 14 మందికి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా ప్రైవేట్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందినే వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక, ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక, బస్సు కావేరీ ట్రావెల్స్‌కు సంబంధించినదిగా గుర్తించారు. Update.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా ఏడుకు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. రెండు లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. నెల్లూరు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు బస్సు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్ది కామెంట్స్ ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. గాయపడిన వారిని నెల్లూరు, ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాం. బాధితుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. 9440796383 ద్వారా సమాచారం ఇస్తున్నాం. ప్రమాదానికి కారణం ఏమిటన్నది విచారణలో తెలుస్తుంది. గాయపడిన వారి వివరాలు.. చంద్ర శేఖర్(37).. సురేష్..(32) గోపి నాథ్ (23) మనోజ్ (23) రాజ్ కుమార్ (38) ఎస్.రమణ (38) పవన్ (23) ధనవేశ్వర్ (28) రణధీర్ (31) త్రికరణ్ (46) శ్వేతా (19) అజిత (30) కన్నన్ (50) రూప( 30) మైథిలి (35) అక్షయ్ (34) గణేష్(51) నితీష్ (20).. లోకేష్ (35) లక్ష్మీ (34) కమలమ్మ (63) నిర్మల(49) కేశవ్(39). -
Extramarital Affair: ప్రియుడు, తండ్రితో కలిసి భర్తను చంపిన భార్య
మదనపల్లె: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను.. ప్రియుడు, కన్నతండ్రితో కలిసి భార్య కిరాతకంగా కడతేర్చిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ దొనబైలు అటవీప్రాంతం గుర్రోళ్లగుట్టలో పూడ్చిపెట్టిన మృతదేహం వెలికితీతతో హత్య గుట్టు రట్టయింది. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన శ్రీనివాసులు(34)కు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన మేనమామ వెంకటరమణ వద్ద పెరిగాడు. తర్వాత జీవనోపాధిలో భాగంగా మదనపల్లెకు వచ్చి చేనేత కార్మికుడిగా స్థిరపడ్డాడు. ఈ క్రమంలో మదనపల్లె మండలంలో దిగువదొనబైలుకు చెందిన గీతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు. కొన్నేళ్లక్రితం మదనపల్లె మండలం జమ్ముకుంటపల్లె వద్ద ఇంటిని కొనుగోలు చేశాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొంత కాలం వేరుగా ఉంటున్నారు. గీత తన పుట్టినిల్లు దిగువ దొనబైలు వద్ద ఉంటుండగా, శ్రీనివాసులు మదనపల్లెలో నివాసం ఉన్నాడు. జనవరి 26న పిల్లలను చూసి వస్తానని వెళ్లిన శ్రీనివాసులు తర్వాత కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు కర్ణాటక సరిహద్దు రాయల్పాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ చెరువులో శ్రీనివాసులు మోటార్‌సైకిల్ లభ్యమైంది. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కర్ణాటక పోలీసులు ఫోన్ చేయగా, వారు మృతుడి మేనమామ వెంకటరమణ ఫోన్ నంబర్ పోలీసులకు ఇచ్చారు. దీంతో వెంకటరమణ రాయల్పాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విచారణ చేయగా, మోటార్‌సైకిల్ తన మేనల్లుడిదేనని నిర్ధారించి, ఆచూకీ కోసం గాలించారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కర్ణాటక పోలీసుల సూచన మేరకు జనవరి 28న మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించిన పోలీసులు శ్రీనివాసులు పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో నివాసం ఉన్నట్లు తేలడంతో టూటౌన్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బండతో మోది హత్య చేసి.. టూటౌన్ పోలీసుల విచారణలో... చీకలబైలు పంచాయతీ ఎగువదొనబైలుకు చెందిన హరికృష్ణ కుమారుడు ముదిమడుగు ప్రసాద్(25)కు, మృతుడు శ్రీనివాసులు భార్య మండెంగీతమ్మ(33)కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. జనవరి 26న శ్రీనివాసులు తన ఇద్దరు పిల్లలను చూసేందుకు చీకలబైలు పంచాయతీ జమ్మికుంటకు వచ్చి, భార్యతో గొడవపడ్డాడన్నారు. అనంతరం మద్యం తాగి, ఇంట్లో పడుకుని ఉండగా, గీత తనకు ఫోన్ చేసి తన తండ్రి పొగాకు రామస్వామిని తీసుకుని, ఇంటికి రావాల్సిందిగా చెప్పిందన్నాడు. తమ సంబంధం సజావుగా సాగాలంటే, భర్త శ్రీనివాసులు అడ్డు తొలగించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. దీంతో ప్రసాద్, గీత తండ్రి రామస్వామి ఇద్దరూ కలిసి మద్యం మత్తులో పడుకున్న శ్రీనివాసులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. అటవీ ప్రాంతంలో పూడ్చివేత అనంతరం శవాన్ని దొనబైలు గ్రామసమీపంలోని అటవీప్రాంతం గుర్రోళ్లగుట్టకు తీసుకెళ్లి ఎవ్వరికీ అనుమానం రాకుండా పూడ్చివేశారు. శ్రీనివాసులు ద్విచక్రవాహనాన్ని కర్ణాటక రాయల్పాడు సమీపంలోని చెరువులో పడేశారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తాలూకా సీఐ శేఖర్, టూటౌన్ ఎస్ఐ వెంకటసుబ్బయ్య, తాలూకా ఎస్ఐ రవికుమార్ గురువారం సాయంత్రం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అప్పటికే చీకటి పడటంతో వెనుదిరిగి, శుక్రవారం ఉదయం సీఐలు వలీబాషు, కృష్ణయ్య, శేఖర్, యువరాజ్లు నిందితులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. హత్యజరిగి 13 రోజులు కావడం, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో అక్కడే శవపంచనామా నిర్వహించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 3 సెల్‌ఫోన్స్, ఒక మోటార్‌సైకిల్, హత్యకు ఉపయోగించిన బండరాయి, పార స్వాధీనం చేసుకున్నారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పుచేసి విచారణ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ ఇనాయతుల్లా, హెడ్‌కానిస్టేబుల్ రామమూర్తి, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. కాగా, హత్యకేసులో గీత తల్లి, తమ్ముడిని అరెస్ట్ చేయాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షులు పొదల నరసింహులు స్థానికులతో కలిసి చీకలబైలు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. -
బరితెగించిన ఎర్రచందనం స్మగ్లర్లు
కేవీపల్లె/పీలేరు: ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టాస్‌్కఫోర్స్ పోలీసులను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. వివరాలు.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి కేవీపల్లె, సుండుపల్లె మండలాల సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్ఎస్ఐ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కేవీ పల్లె మండల సరిహద్దు వద్ద గస్తీ కాస్తుండగా.. మంగళవారం తెల్లవారుజామున కేఏ 02 ఎంజీ 2847 నంబర్ కలిగిన స్విఫ్ట్ కారు అటుగా దూసుకువచ్చింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కారు వేగంగా వచ్చి కానిస్టేబుల్ బి.గణేశ్(40)ను ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే గణేశ్ మృతి చెందాడు. టాస్‌్కఫోర్స్ పోలీసులు కారును చుట్టుముట్టేసరికి ముగ్గురు స్మగ్లర్లు పారిపోగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఏడు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలను తెలుసుకున్నారు. కానిస్టేబుల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గణేశ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం విధి నిర్వహణలో గణేశ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ మానవత్వంతో స్పందించారు. గణేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.30 లక్షలు ప్రకటించారు. ఈ విషయాన్ని అనంతపురం డీఐజీ వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రి వద్ద గణేశ్ మృతదేహానికి డీఐజీ, ఎస్పీ, టాస్‌్కఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ నివాళులర్పించారు. గణేశ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. గణేశ్‌కు నివాళులర్పించిన వారిలో డీఎస్పీ మహబూబ్‌బాషా, డీఎఫ్‌వో వివేక్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి, ఎఫ్ఆర్వో రామ్లానాయక్, సీఐలు మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులున్నారు. శోకసంద్రంలో కుటుంబసభ్యులు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లెకు చెందిన గణేశ్.. 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తిరుపతి టాస్‌్కఫోర్స్‌లో కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ.. తిరుపతిలోనే నివాసం ఉంటున్నారు. గణేశ్‌కు భార్య అనూషతో పాటు కుమారులు రాజకిశోర్(6), వేదాన్‡్ష(3) ఉన్నారు. పీలేరు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన గణేశ్ కుటుంబసభ్యులు.. అతని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య
విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్‌ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకు టికెట్ బుక్ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్పోర్ట్ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్‌హోస్టెస్ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు. బస్సులో చెన్నైకు.. బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్పుట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ– 1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్ తెలిపారు. కన్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. -
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్
విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారాంను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు. నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. ‘‘విశాఖ రూరల్ ఎమ్మర్వో రమణ హత్య కేసులో నిందితుడి మురారి సుబ్రహ్మణ్యం గంగారావుని అరెస్ట్ చేశాం. చెన్నై పోలీసుల సహకారం తో నిందితుడ్ని అరెస్ట్ చేయగలిగాం. హత్య అనంతరం నిందితుడు విమానంలో బెంగుళూర్ పరారయ్యాడు. అక్కడి నుంచి బస్‌లో చెంగల్పట్టు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. ఆపై నిందితుడిని విశాఖ తీసుకొచ్చాం. నిందితుడిపై విజయవాడ, హైదరాబాద్‌లో చీటింగ్ కేసులున్నాయ్. .. నిందితుడ్ని పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలు శ్రమించాయి. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తోంది. కంబైన్డ్ డీడ్ చేయడంలో ఎమ్మార్వో జాప్యం చేయడంతోనే చంపినట్లు నిందితుడు చెబుతున్నాడు. అతన్ని పూర్తిగా విచారించాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని సీపీ తెలిపారు. ఇదిలా ఉంటే.. విశాఖలో ల్యాండ్ వివాదాలపై ఇక నుంచి ప్రతివారం విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ల్యాండ్ ధరలు పెరిగిన దశలో సహజంగా వివాదాలు తలెత్తుతున్నాయని.. అందుకే కలెక్టర్ సహకారంతో ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటామని అన్నారాయన. -
హత్యాయత్నం కేసులో టీడీపీ నేతల అరెస్ట్
తిరుత్తణి/నగరి (చిత్తూరు జిల్లా): ఏపీ మంత్రి రోజా కార్యాలయ నిర్వాహకుడు ప్రతీష్పై ఈ నెల 2వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతల్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో ప్రతీష్ పై హత్యాయత్నం తెలుగుదేశం కుట్రేనని స్పష్టమైంది. తెలుగుయువత నాయకులైన నిందితులు టీడీపీ నగరి ఇన్చార్జి గాలి భానుప్రకాష్ అనుచరులే. వీరిని ఆదివారం నగరి, తిరుత్తణి సరిహద్దులోని తాళవేడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యాయత్నం చేసింది తామేనని చెప్పడంతో నగరి మండలం మేళపట్టుకు తెలుగుయువత మండల ఉపాధ్యక్షుడు నవీన్ అలియాస్ వెట్టు నవీన్, నాయకులు నగరి మున్సిపాలిటీ కీళపట్టు బీసీ కాలనీకి చెందిన చిరంజీవి, నిండ్ర మండలం వైఎన్ కండ్రిగకు చెందిన పరశురాం అలియాస్ మధులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. హత్యకు తెలుగు యువత మండల అధ్యక్షుడి కుట్ర ప్రతీష్ను హత్యచేసేందుకు తెలుగుయువత మండల అధ్యక్షుడు చిట్టిబాబు ప్రణాళిక రూపొందించినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ కేసు వివరాలను తిరుత్తణి సీఐ మార్టిన్ ప్రేమ్‌రాజ్ విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భానుప్రకాష్ పై ఆర్కే రోజా గెలవడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం వర్గీయులు ఆమెపై కక్షపెంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే.. రోజా తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె కార్యాలయ మేనేజర్ ప్రతీష్ను హత్యచేయాలని తెలుగుయువత నగరి మండల అధ్యక్షుడు చిట్టిబాబు కుట్రపన్నారు. అతడితో నవీన్, చిరంజీవి, పరశురాం చేతులు కలిపారు. నగరిలో హత్యచేస్తే రాజకీయరంగు పులుముకుంటుందని, అందువల్ల ప్రతీష్ను అతను ఉండే తిరుత్తణిలోనే హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ తిరుత్తణిలో బసచేశారు. ప్రతీష్ వాకింగ్ చేసే ప్రదేశాన్ని రాత్రి ఒంటిగంట సమయంలో పరిశీలించి వచ్చిన చిట్టిబాబు హత్యచేయడానికి అనువుగా ఉందని మిగిలినవారికి చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా వస్తే సమాచారం అందించడానికి నిండ్రకు చెందిన ముగ్గురు కిరాయి మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వచ్చిన ప్రతీష్పై ఇనుపరాడ్లతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తలపై కొట్టే సమయానికి ప్రతీష్ చెయ్యి అడ్డుపెట్టడంతో చేతికి బలమైన గాయమైంది. ఇంతలో సమీపంలో ఉన్న జనం కేకలు వేయడంతో ఇప్పుడు మిస్ అయింది.. మరోసారి వేసేస్తాం.. అని అరుస్తూ ముళ్లకంపల మధ్య దాచి ఉంచిన బైక్ మీద పరారయ్యారు. పార్టీ నాయకులకు సన్నిహితం హత్యాయత్నం కేసులో నిందితులు పార్టీ నాయకుడు గాలి భానుప్రకాష్తో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు లోకేశ్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సెల్ఫీ తీసుకునే చనువు కూడా వారికి ఉంది. -
Tahsildar Murder Case: నిందితుల కోసం ముమ్మర గాలింపు
పీఎంపాలెం: నగరంలో సంచలనం సృష్టించిన తహసీల్దార్ రమణయ్య హత్యకేసు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హత్య చేసిన తరువాత నిందితుడి విమానంలో బెంగళూరు వెళ్లినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రెండు పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు తెలిసింది. హత్యా సంఘటనలో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న మధురవాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు అర్చకులను ఇప్పటికే పోలీసులు విచారించారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే నిందితుల కోసం పది పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు. -
AP: ఆచంటలో ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి,పశ్చిమగోదావరి: జిల్లాలోని ఆచంట మండలం కోడేరు రోడ్డుపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతి చెందిన వారిని కరుగోరిమిల్లి,ముత్యాలపల్లి గ్రామానికి చెందిన వాసుదేవ (13) కుక్కల నాగరాజు( 12) గా గుర్తించారు. ఆటోలో ఉన్న మరో అయిదుగురికి తీవ్ర గాయాలవడంతో 108 అంబులెన్సులో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
MRO రమణయ్య హత్య కేసును చేధించాం: విశాఖ సీపీ
విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసును చేధించినట్లు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు.. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం. నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడు. టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పది టీమ్‌లు రంగంలోకి దిగాయి. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నాం. చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్‌కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదు అని సీపీ రవిశంకర్ వెల్లడించారు. రాత్రి పది గంటల సమయంలో హత్య జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్యకు ఆర్ధిక లావాదేవీలు కారణమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహశీల్దార్ సెండాఫ్ చెప్పడానికి వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు అని సీపీ మీడియాకు కేసు వివరాలను వివరించారు. ఇదీ చదవండి: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్‌గా సనపల రమణయ్య రెండు రోజుల కిందటి దాకా విధులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి సమయంలో కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో రమణయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిరాగానే రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది చూసి నిందితుడిని పట్టుకునేందుకు అపార్ట్‌మెంట్‌వాసులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొలుత నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. -
విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి తహసీల్దార్‌పై దాడి చేయడంతో ఆయన మృతిచెందాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో తహసీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వద్దనే ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది గమనించిన అపార్ట్‌మెంట్‌వాసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నాడు. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహశీల్దార్‌గా పనిచేశారు. రమణయ్య విధుల్లో చాలా నిజాయితీగా ఉండేవారని తోటి అనుచరులు చెబుతున్నారు. ఇక, ఈ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రమణయ్య హత్య కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో నిందితుడి కోసం 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రమణయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
బనియన్ల నిండా బంగారం, నగదే
సాకక్షి, కర్నూలు: సినీ ఫక్కీలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం, నగదు పెట్టుకుని దర్జాగా బస్సులో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,84,53,500 నగదు, 4.565 కిలోల బంగారం, 5కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా బంగారం తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కృష్ణగిరి, వెల్దుర్తి ఎస్ఐలు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సీఐ గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో తనిఖీలు చేయగా, అమర్‌ప్రతాప్ పవార్(నంద్యాల), శబరి రాజన్(సేలం, తమిళనాడు), వెంకటేష్ రాహుల్(కోయంబత్తూరు), సెంథిల్‌కుమార్ (కోయంబత్తూరు) సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్‌కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అమర్‌ప్రతాప్ పవార్ నుంచి రూ.1,20,80,000, శబరి రాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్ రాహుల్ నుంచి 3.195 కిలోల బంగారం, రూ.19,23,500 నగదు, సెంథిల్‌కుమార్ నుంచి 1.37కిలోల బంగారం, రూ.44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ రూ.2,74,54,800 ఉంటుంది. బంగారం, వెండి, నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ మస్తాన్, వీఆర్వో గిడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్‌లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్‌తోపాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్ సిబ్బందిని అభినందించారు. కాగా, గత నెల 26న రాత్రి ఇదే టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం చేసుకున్నారు. -
నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కడప: సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు. పుట్టా సుధాకర్‌యాదవ్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన రంజిత్‌కుమార్ (47)తో పరిచయం ఏర్పడింది. అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్‌కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్ రేంజ్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్‌ను సంప్రదించారు. ఎస్ఐ సుజన్ కడప అశోక్‌నగర్‌లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌ను పరిచయం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. రూ.10కోట్లు డిమాండ్ అమెరికాలోని క్లయింట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్‌లోని బాల్కనీ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు. విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. -
అనకాపల్లి: పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ దారుణ హత్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ను దారుణంగా హత్య చేశారు. గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఏసీబీ వలలో జిల్లా మలేరియా అధికారి
ఒంగోలు టౌన్: పీఆర్సీ అరియర్స్ బిల్లు మంజూరు చేసేందుకు 25 శాతం లంచం డిమాండ్ చేసిన ప్రకాశం జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, ఆమెకు సహకరించిన అసిస్టెంట్ జిల్లా అధికారి శీనయ్యను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని దోర్నాల పీహెచ్సీలో మల్టిపర్పస్ హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్న ఇజ్రాయిల్‌కు 2015–21 పీఆర్సీ అరియర్స్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని జిల్లా మలేరియా అధికారిణి జ్ఞానశ్రీని పలుమార్లు కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. పెండింగ్ బిల్లులో 25 శాతం లంచం ఇస్తే తాను బిల్లు మంజూరు చేస్తానని డిమాండ్ చేశారు. దాంతో ఇజ్రాయిల్ తనకు రావాల్సిన అరియర్స్‌తో పాటు..తన అర్హతల ప్రకారం పదోన్నతి కలి్పంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో స్పందించిన రీజినల్ డైరెక్టర్, ఇజ్రాయిల్ అరియర్స్ డబ్బులు ఎందుకు మంజూరు చేయలేదో వివరణ ఇవ్వాల్సిందిగా డీఎంఓకు మెమో ఇచ్చారు. అలాగే కోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు గానూ రిమార్క్స్ అడిగారు. ఈ క్రమంలో అనివార్య పరిస్థితుల్లో ఇజ్రాయిల్ అరియర్స్ పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తూ సంతకం చేశారు. బిల్లు డబ్బులు బ్యాంకులో జమ అయిన వెంటనే తనకు లంచం డబ్బులు ఇవ్వాలని కోరారు. ఈనెల 10వ తేదీ అరియర్స్ తాలుకు రూ.16,83,103 బ్యాంకులో జమయ్యాయి. జిల్లా కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ జరిగిన మీటింగ్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయిల్ ఒంగోలుకు వచ్చారు. మీటింగ్ అయిపోయాక తన ఇంటికి వచ్చి కలవాలని డీఎంఓ జ్ఞానశ్రీ అతడిని ఆదేశించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి శీనయ్యను ఇందుకు పురమాయించారు. దాంతో ఇద్దరూ కలిసి జ్ఞానశ్రీ ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యలో ఉండగా ఫోన్ చేసిన డీఎంఓ తాను ఇంట్లో లేనని, వర్మాస్ హోటల్‌కు వచ్చి కలవాలని చెప్పారు. అక్కడ బిల్లుల డబ్బులు బ్యాంకులో పడ్డాయి కనుక ముందుగా చెప్పిన ప్రకారం తనకు బిల్లు మొత్తంలో 25 శాతం రూ.4 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అతడి డైరీలో ఉన్న చెక్‌బుక్కును చూసి ఆమె చెక్కు రాసివ్వాలని డిమాండ్ చేశారు. చెక్ చెల్లదని చెప్పడంతో ఏటీఎం, పేటీఎంల ద్వారా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అయితే రూ.4 లక్షలు ఇవ్వలేనని బతిమాలు కోవడంతో చివరికి రూ.1.40 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఇజ్రాయిల్ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం జ్ఞానశ్రీకి డబ్బులు ఇస్తానని చెప్పడంతో వాటిని తీసుకునేందుకు అసిస్టెంట్ మలేరియా అధికారి శీనయ్యను సమీపంలోని సూపర్ బజార్ వద్దకు పంపించారు. అక్కడ ఇజ్రాయిల్ నుంచి డబ్బులు తీసుకుంటున్న శీనయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత జిల్లా మలేరియా కార్యాలయానికెళ్లి డీఎంవో జ్ఞానశ్రీని కూడా అదుపులోకి తీసుకున్నారు. -
ఇన్సూరెన్స్ సొమ్ము కోసం... శవపేటికలోని మృతదేహం అపహరణ
రంగంపేట/రాజమహేంద్రవరం రూరల్: అప్పుల పాలైన ధాన్యం వ్యాపారి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తాను మృతిచెందినట్లు శవపేటికలో ఉన్న మృతదేహాన్ని తీసుకువచ్చి పెట్రోలు పోసి కాల్చి నమ్మించేందుకు చేసిన ప్రయత్నం పోలీసుల విచారణలో బెడిసికొట్టింది. చివరకు ధాన్యం వ్యాపారితో పాటు, అతనికి సహకరించిన ముగ్గురు కటకటాల పాలయ్యారు. రంగంపేట మండలం పాతవీరంపాలెం గ్రామశివారు కేతమల్లు వెంకటేశ్వరరావు(పూసయ్య) జీడిమామిడితోటలో ఈ నెల 26వ తేదీన కాలిన మృతదేహం ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహం వెంకటేశ్వరరావుదిగా భావించి పోస్టుమార్టం కోసం అనపర్తి ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు భార్య అతని మృతదేహంపై పడి తీవ్రంగా ఆవేదన చెందుతున్న విషయం తెలుసుకున్నాడు. దీంతో అతను వెంటనే భార్యకు ఫోన్ చేసి ఎవరో బాడీని తగులబెట్టి తనను కొట్టి తుప్పల్లో పడవేశారని చెప్పాడు. వెంకటేశ్వరరావు బతికి ఉండడంతో కాలిన మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అనపర్తి సీఐ పి.శివగణేష్, రంగంపేట ఎస్సై పి.విజయకుమార్ దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు అసలు విషయాన్ని బయట పెట్టాడు. వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు(పోసియ్య)కు అప్పులు ఎక్కువగా ఉండడంతో తన పేరుపై ఉన్న రూ. కోటి ఇన్సూరెన్న్స్ను క్లయిమ్ చేసుకొనేందుకు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్‌ను అమలు చేసేందుకు హుకుంపేట గ్రామానికి చెందిన వందే శ్రీను, తలారి సుబ్బారావు, మోరంపూడికి చెందిన సిరాచిన్నాలతో వెంకటేశ్వరరావును వినియోగించాడు. ఒక శవాన్ని తీసుకొచ్చి తన పొలంలో కాల్చేయాలని నిర్ణయించాడు. ఆ ముగ్గురితో రూ.రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు ఈ నెల 25వ తేదీ రాత్రి పాతబొమ్మూరులోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఒక శవాన్ని తవ్వి బయటకు తీశారు. సదరు మృతదేహాన్ని శ్రీను కారులో వేసుకొని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పాత వీరంపాలెం వెళ్లి వెంకటేశ్వరరావుకు తెలిపాడు. ఇద్దరూ కలిసి శవాన్ని తగులబెట్టి అక్కడనుంచి పరారయ్యారు. ఈ నెల 26వ తేదీన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ కాలిపోయిన బాడీ వెంకటేశ్వరరావుది అని భావించి శవాన్ని అనపర్తి హాస్పిటల్‌కు తరలించారు, అనంతరం గ్రామంలో తన భార్య, పిల్లలు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని శ్రీను ద్వారా తెలిసి, ఎవరో బాడీని తగులబెట్టి తనని కొట్టి తుప్పల్లో పడేసారని డ్రామా మొదలెట్టాడు. చివరకు పోలీసులు వెంకటేశ్వరరావు, అతనికి సహకరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం డ్రామా బయటపడింది. ఆ మృతదేహం నెల్లి విజయరాజుది పాతబొమ్మూరు క్రైస్తవ శ్మశానవాటికలో తస్కరించిన మృతదేహం బొమ్మూరు గ్రామానికి చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి నెల్లి విజయరాజుదిగా పోలీసులు గుర్తించారు. నెల్లివిజయరాజు అనారోగ్యంతో ఈనెల 23వ తేదీన మృతిచెందారు. ఈ నెల 24న ఖననం చేశారు. 29న అతని జ్ఞాపకార్థకూడిక నిర్వహించారు. అయితే మంగళవారం రంగంపేట పోలీసులు నిందితులను తీసుకుని పాతబొమ్మూరు శ్మశానవాటిక వద్దకు వెళ్లే వరకు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు నెల్లి విజయరాజు మృతదేహాన్ని తీసుకువెళ్లి పెట్రోలుతో దహనం చేశారన్న విషయం తెలియలేదు. పోలీసులు విజయరాజు ఖననం చేసిన చోట తవ్వించి చూడగా అందులో మృతదేహం కనిపించలేదు. అనపర్తి హాస్పిటల్లో ఉన్న మృతదేహం విజయరాజుదిగా ఆయన కుటుంబసభ్యులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పాతబొమ్మూరులోని శ్మశానవాటికకు తీసుకువచ్చి ఖననం చేశారు. -
రూ.50 లక్షలకు టీడీపీ నేత టోకరా
బొమ్మలసత్రం (నంద్యాల): తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేద్దామని చెప్పి ఓ డీఎస్పీ కుమారుడ్ని నిండా ముంచేసిన ఘటనలో మైదుకూరు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి మల్లిఖార్జునయాదవ్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్‌యాదవ్ సన్నిహితుడు, కాంట్రాక్టర్ మల్లిఖార్జునయాదవ్ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, కొల్లాపూర్ మధ్య కేతిపల్లి గ్రామంలో వంతెన నిర్మాణ పనులకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో నంద్యాలలో నివశిస్తున్న కర్నూలు, నంద్యాల జిల్లాల ఇంటెలిజెన్స్ విభాగం ఇన్ఛార్జ్ డీఎస్పీ యుగంధర్ కుమారుడు చిరంజీవిని భాగస్తుడిగా చేసుకుని కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశారు. మల్లిఖార్జునయాదవ్ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో చిరంజీవికి రూ.80 లక్షలు చెల్లించేలా మల్లిఖార్జునయాదవ్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే రూ.30 లక్షలు చెల్లించి.. మిగతా రూ.50 లక్షలు చెల్లించకుండా మొండికేశాడు.దీంతో చిరంజీవి నంద్యాల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మల్లిఖార్జునయాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరిబాబు తెలిపారు. -
తీగ లాగితే.. టీడీపీ కదిలింది
సాక్షి, అమరావతి: నల్లధనం తీగ లాగితే టీడీపీ డొంక కదిలింది! పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ‘నోవా అగ్రిటెక్’ జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు నిర్వహిస్తే ఆ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం బాగోతం బట్టబయలైంది. గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తనిఖీల్లో వెల్లడైంది. వ్యాపార కార్యకలాపాల ముసుగులో షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో నిగ్గు తేలింది. విచారణకు సహకరించకుండా మొండికేస్తున్న నోవా అగ్రిటెక్‌కు డీఆర్ఐ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు బాపట్ల పోలీసులు సిద్ధమయ్యారు. లెక్కా పత్రాలు లేవు.. జీఎస్టీ ఎగవేస్తున్న కంపెనీల జాబితాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జాబితాలో ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు విస్తుపోయారు. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి నోవా కార్యాలయంలో ఒక్క రికార్డు కూడా లేదు. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు, రశీదులు, ఇన్వాయిస్లు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వివరాలేవీ లేవు. దీంతో అసలు ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో మాత్రం చాలా మంది పేర్లు ఉండగా వారిలో సగం మంది ఉద్యోగులు కూడా కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. జీఎస్టీకి సంబంధించిన పత్రాలేవీ రికార్డుల్లో లభించ లేదు. దీంతో నోవా అగ్రిటెక్ కంపెనీకి నోటీసులు జారీ చేసి బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ డీఆర్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నల్లధనం కేరాఫ్ ‘నోవా’ నోవా అగ్రిటెక్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా లభ్యమైన ఓ డైరీ ఎన్నికల్లో టీడీపీ నేతల నల్లధనం పంపిణీ గుట్టును రట్టు చేసింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అందులో సవివరంగా ఉంది. నల్లధనం వెదజల్లి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం నోవా కంపెనీని నెలకొల్పినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుకాయించారు. కంపెనీ పేరిట భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు కాకుండా నల్లధనం చలామణి సాగిస్తున్నట్లు డైరీతో పాటు అక్కడ లభ్యమైన మరికొన్ని కీలక ఆధారాలు వెల్లడించాయి. అందుకోసమే కంపెనీ బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నోవాకు నగదు ఏ ఖాతాల నుంచి వస్తోంది? ఆదాయ వనరులు ఏమిటి? అనే వివరాలపై కంపెనీ ఉద్యోగులు మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించాలని కోరుతూ కేంద్ర ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లకు డీఆర్ఐ అధికారులు నివేదించారు. నోవా యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ పోలీసుశాఖ బాపట్ల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అనంతరం ఈ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇతరులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించనున్నారు. -
‘నారాయణ’లో విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ (విశాఖజిల్లా): నారాయణ క్యాంపస్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం పట్టణంలోని పీఎస్ఎన్ఎం స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న నెల్లూరు రవికుమార్, ఆయన భార్య మార్కెటింగ్ శాఖలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, చిన్న కుమారుడు నెల్లూరు అఖిల్ వినాయక్(15)ను విశాఖలోని నారాయణ విద్యాసంస్థలో 6వ తరగతి నుంచి చదివిస్తున్నారు. ప్రస్తుతం పీఎంపాలెంలోని క్యాంపస్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గణతంత్ర వేడుకలకు సహచర విద్యార్థులు వెళ్లగా, నిఖిల్ మాత్రం హాస్టల్ రూము నంబరు 203లోనే ఒంటరిగా ఉన్నాడు. సుమారు 10.15 గంటల సమయంలో జెండా వందనం కార్యక్రమం పూర్తయి సహచర విద్యార్థులు వచ్చేసరికి నిఖిల్ వినాయక్ గదిలో ప్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఉన్నాడు. అతడిని వైద్యం నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి యాజమాన్యం తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిఖిల్ ప్యాంటు కుడి జేబులో ‘నా చావుకి నేనే కారణం. పదో తరగతి ఫెయిల్ అవుతాననే భయంతో చస్తున్నాను.. ’ అని రాసిన లేఖ ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే నా కుమారుడు మృతి ‘బాగా చదువు చెబుతారని ఏడాదికి రూ.2లక్షలు ఫీజు కట్టి నారాయణ పీఎంపాలెం క్యాంపస్‌లో చేర్పించాను. నా కుమారుడు నిఖిల్‌పై గత ఏడాది ఆగస్టు 7వ తేదీన సహచర విద్యార్థులు దాడి చేయగా, బాగా దెబ్బలు తగిలాయి. ఫిట్స్ కూడా వచ్చాయి. నాలుగు నెలలు ఇంటి వద్దే ఉంచాం. ఆ తర్వాత మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చాం. గత ఏడాది గొడవ జరిగినప్పుడు ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పుటి నుంచే నిఖిల్ ఆరోగ్యం పాడైంది. ఈ నెల 21న నిఖిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్డెన్ శ్రావణ్ ఫోన్ చేసి చెప్పారు. రూ.వెయ్యి ఫోన్ పే ద్వారా పంపించగా, వైద్యం చేయించారు. అనారోగ్యానికి గురైన నిఖిల్‌ను ఒంటరిగా గదిలో మేనేజ్మెంట్ వదిలేసింది. ఉదయం 10.15 గంటలకు ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని గుర్తించినా, 10.45 గంటల వరకు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. కనీసం 108 అంబులెన్స్‌కు కూడా ఫోన్ చెయ్యలేదు. పక్కనే ఆస్పత్రి ఉన్నా, హాస్టల్ వ్యాన్‌లో గాయత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నా కుమారుడి మృతికి నారాయణ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ ఒత్తిడి లేదా ఇంకా ఏమైనా జరిగి ఉండవచ్చు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.– నెల్లూరి రవికుమార్, విద్యార్థి నిఖిల్ వినాయక్ తండ్రి, శ్రీకాకుళం -
ఒంటరి జీవితం భరించలేక..
బి.కొత్తకోట : భర్త దూరమై ఒంటరి జీవితం భరించలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున బి.కొత్తకోటలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ మారుతిరెడ్డి కథనం మేరకు వివరాలు. స్థానిక కరెంట్ కాలనీలో నివాసం ఉంటున్న కె.లక్ష్మిదేవి, రెడ్డెప్పలు భార్యాభర్తలు. వీరికి సంతానం లేదు. భర్త రెడ్డెప్ప రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇటీవల లక్ష్మిదేవి కూడా అనారోగ్యానికి గురైంది. భర్త దూరం కావడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరి జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించారు. మృతురాలి అక్క కుమార్తె రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
నేడు ఏసీబీ కోర్టులో స్కిల్ కేసు విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. అప్రూవల్‌గా మారిన నిందితుడు ఏసీఐ ఎండి శిరీష్ చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో సీఐడి కోర్టు సమర్పించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరారు. దీనిపై పిటీషన్ దాఖలు చేయాలని కోర్టు అదేశించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డ్‌ను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ.. ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది. స్కిల్ కేసులో అప్రూవర్‌గా మారుతున్నట్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పిటిషన్ వేశారు. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు స్వాహా చేశారని చంద్రకాంత్ షా కోర్టుకి ఆధారాలు సమర్పించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తాను నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా చంద్రకాంత్ షా పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఎ- 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా.. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని వారు కోరినట్లు పిటీషన్ పేర్కొన్నారు. ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా.. బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అవే నిధులను సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా తెలిపారు. ఆ 65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. -
Nara Lokesh: రెడ్‌బుక్ కేసు విచారణ నేడు
విజయవాడ, సాక్షి: నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటీసులు అందుకోకపోవడంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువగళం పేరిట యాత్ర చేపట్టిన నారా లోకేష్.. ముగింపు రోజున పలు ఇంటర్వ్యూల్లో కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారు. దీంతో గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్‌ను ఆదేశించింది. మెమోలో ఏముందంటే.. యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది. ఆ వాంగ్మూలాలు తప్పేనంటూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది. లోకేష్‌పై కోర్టు సీరియస్ రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులును లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించింది. దీంతో చేసేది లేక రిజిస్టర్ పోస్టులో సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపింది. -
రూ.3 కోట్ల నగదు పట్టివేత
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా)/ఆదోని సెంట్రల్: జాతీయ రహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న రూ.2,07,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విభీషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి వేంపాడు టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, తుని నుంచి విశాఖ వెళ్తున్న ఒక కారును ఆపి చూడగా లోపల ఐదు బ్యాగుల్లో రెండుకోట్ల ఏడు లక్షల యాభైవేలరూపాయల నగదు లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు వెంకటేశ్వరరావు,యాదవరాజు కారులో ఈ నగదు తీసుకెళ్తున్నట్లుతెలిపారు. తాము ధాన్యం వ్యాపారం చేస్తున్నట్లు వీరు చెప్పారని, ఈ నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించలేదన్నారు. నగదుతోపాటు, కారును కూడా సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రూ. కోటి నగదు స్వాదీనం రైల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి నగదును స్వాధీనం చసుకున్నట్లు రైల్వే డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీర్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి దాటాక రైల్వే ఎస్పీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఆదోని పట్టణానికి చెందిన కోల్కర్ మహమ్మద్ అనే వ్యక్తి నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైల్లో ప్రయాణిస్తూ ఆదోనిలో దిగాడని, రైల్వే పోలీసులు బ్యాగులు తనిఖీ చేయగా రూ.1,00,95,450 నగదు గుర్తించినట్లు తెలిపారు. విచారణలో అతడు నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు అందజేయలేదన్నారు. స్వా«దీనం చేసుకున్న నగదును నిబంధనల మేరకు ఆదాయపు పన్నుశాఖకు అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలకు సంబంధించి ప్రయాణికులు 9440627669 నంబర్‌కు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు.