‘నారాయణ’లో విద్యార్థి ఆత్మహత్య

A ninth grade boy who hanged himself from a fan - Sakshi

ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న తొమ్మిదో తరగతి బాలుడు 

యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి తండ్రి

విశాఖ పీఎంపాలెం నారాయణ క్యాంపస్‌లో ఘటన

మధురవాడ (విశాఖజిల్లా): నారాయణ క్యాంపస్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం పట్టణంలోని పీఎస్‌ఎన్‌ఎం స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న నెల్లూరు రవికుమార్, ఆయన భార్య మార్కెటింగ్‌ శాఖలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, చిన్న కుమారుడు నెల్లూరు అఖిల్‌ వినాయక్‌(15)ను విశాఖలోని నారాయణ విద్యాసంస్థలో 6వ తరగతి నుంచి చదివిస్తున్నారు.

ప్రస్తుతం పీఎంపాలెంలోని క్యాంపస్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గణతంత్ర వేడుకలకు సహచర విద్యార్థులు వెళ్లగా, నిఖిల్‌ మాత్రం హాస్టల్‌ రూము నంబరు 203లోనే ఒంటరిగా ఉన్నాడు. సుమారు 10.15 గంటల సమయంలో జెండా వందనం కార్యక్రమం పూర్తయి సహచర విద్యార్థులు వచ్చేసరికి నిఖిల్‌ వినాయక్‌ గదిలో ప్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఉన్నాడు.

అతడిని వైద్యం నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి యాజమాన్యం తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిఖిల్‌ ప్యాంటు కుడి జేబులో ‘నా చావుకి నేనే కారణం. పదో తరగతి ఫెయిల్‌ అవుతాననే భయంతో చస్తున్నాను.. ’ అని రాసిన లేఖ ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే నా కుమారుడు మృతి
‘బాగా చదువు చెబుతారని ఏడాదికి రూ.2లక్షలు ఫీజు కట్టి నారాయణ పీఎంపాలెం క్యాంపస్‌లో చేర్పించాను. నా కుమారుడు నిఖిల్‌పై గత ఏడాది ఆగస్టు 7వ తేదీన సహచర విద్యార్థులు దాడి చేయగా, బాగా దెబ్బలు తగిలాయి. ఫిట్స్‌ కూడా వచ్చాయి. నాలుగు నెలలు ఇంటి వద్దే ఉంచాం. ఆ తర్వాత మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చాం. గత ఏడాది గొడవ జరిగినప్పుడు ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పుటి నుంచే నిఖిల్‌ ఆరోగ్యం పాడైంది.

ఈ నెల 21న నిఖిల్‌ జ్వరంతో బాధపడుతున్నాడని వార్డెన్‌ శ్రావణ్‌ ఫోన్‌ చేసి చెప్పారు. రూ.వెయ్యి ఫోన్‌ పే ద్వారా పంపించగా, వైద్యం చేయించారు. అనా­రో­గ్యానికి గురైన నిఖిల్‌ను ఒంటరిగా గదిలో మేనేజ్‌మెంట్‌ వదిలేసింది. ఉదయం 10.15 గంటలకు ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని గుర్తించినా, 10.45 గంటల వరకు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. కనీసం 108 అంబులెన్స్‌కు కూడా ఫోన్‌ చెయ్యలేదు.

పక్కనే ఆస్పత్రి ఉన్నా, హాస్టల్‌ వ్యాన్‌లో గాయత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నా కుమారుడి మృతికి నారాయణ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ ఒత్తిడి లేదా ఇంకా ఏమైనా జరిగి ఉండవచ్చు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.– నెల్లూరి రవికుమార్, విద్యార్థి నిఖిల్‌ వినాయక్‌ తండ్రి, శ్రీకాకుళం

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top