కో‘ఢీ’ అంటే చర్యలు తప్పవు! | Sakshi
Sakshi News home page

కో‘ఢీ’ అంటే చర్యలు తప్పవు!

Published Tue, Jan 9 2018 10:30 PM

Action against Cockfights, dsp warning - Sakshi

సాక్షి, కదిరి: కదిరి, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి హెచ్చరించారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మంగళవారం ఎమ్మార్వో పీవీ రమణ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ ప్రసంగించారు. గ్రామాల్లో ఆయా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పోలీస్‌కు సహకరించి కోడిపందేలు జరగకుండా చూడాలని కోరారు. గతంలో కోడిపందేల కేసుల్లో ఉన్నవారిని ఆయా ఎమ్మార్వోల ఎదుట బైండోవర్‌ చేయిస్తామన్నారు.

కోడి పందేల నిర్వహణకు ఎవరైనా తమ స్థలాలు, తోటలు ఇచ్చినట్లు తెలిస్తే వారిపై కూడా కేసులను నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించిన వారిపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు యానిమల్‌ యాక్టు, ఏపీ గేమింగ్‌ యాక్టుల కింద కేసులు బనాయిస్తామని తెలిపారు. ఇప్పటి నుండి ఈ నెల 24 వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉంటుందన్నారు. కోడి పందేల బదులు సంక్రాంతిని పురష్కరించుకొని పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహిద్దామని, అందులో ప్రతిభ కనబరచిన మహిళలు బహుమతులు అందజేద్దామని సీఐ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు హేమంత్‌కుమార్, సహదేవరెడ్డి, మగ్బుల్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement