అరచేతిలో నేరస్తుల చిట్టా

police department preparing criminals database - Sakshi

ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వే

సేకరణకు పోలీసు శాఖ ఉత్తర్వులు

నేరగాళ్ల వివరాలు పోలీస్‌ డేటాబేస్‌ సర్వర్‌కు అనుసంధానం

నేరస్తుల గృహాలకు జియో ట్యాగింగ్‌

ఆదిలాబాద్‌: 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే అందరికీ గుర్తుండే విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు తెలంగాణలోని అన్ని కుటుంబాల వివరాలను ఇంటింటికీ తిరిగి సేకరించారు. అదే మాదిరిగా ఈనెల 18న ఒకే రోజు  నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహించేందుకు ఆదిలాబాద్‌ జిల్లా పోలీసు శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఎస్పీకి ఉత్తర్వులు అందాయి. నేరస్తుల సమగ్ర వివరాల సేకరణ కోసం పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. నేరగాళ్లతో పాటు వారింట్లోని ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా తమవద్ద ఉన్న ట్యాబ్‌లలో చిత్రీకరిస్తారు. 2008 జనవరి 1 నుంచి జరిగిన అన్ని నేరాలకు సంబంధించిన నేరగాళ్ల రికార్డులను ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత ఫైళ్ల దుమ్ము దులిపి రికార్డులన్నిటినీ క్రోడీకరించే పనిలో తలామునకలై ఉన్నారు. ఈ రికార్డుల ఆధారంగా నేరగాళ్లందరినీ గుర్తించి, వారి పేర్లతో ఓ జాబితా రూపొందించనున్నారు. 18న ఒకే రోజు సమగ్ర సర్వే చేపట్టి, ఆ తర్వాత వారం రోజుల పాటు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నేరస్తుల వివరాల సేకరణ పూర్తయిన తర్వాత పోలీసు అధికారులు ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

వివరాల సేకరణ ఇలా..
గతంలో దొంగతనాలు, దోపిడీ, హత్యలు, కిడ్నాప్‌లు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమరవాణా వంటి తదితర నేరాలకు పాల్పడిన నేరస్తుల పూర్తి వివరాలను సేకరించడానికి ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహిస్తోంది. పోలీసులు సదరు నేరస్తుల ఇళ్లకు వెళ్తారు. రేషన్, ఓటరు, పాన్, ఆధార్‌కార్డు, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి ఇతర సామాజిక ఖాతాల వివరాలు సేకరిస్తారు. వేలిముద్రలు, ఇంటి నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుంటారు. ఇలా సేకరించిన వివరాలను పోలీసు శాఖకు ఉన్న డాటాబేస్‌ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా.. దొంగతనానికి పాల్పడింది పాతవాళ్లు అయితే వెంటనే ఈ విధానం ద్వారా పట్టుకునే వీలుంటుంది. ఇప్పటికే జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల నుంచి నేరాలు, నేరస్తుల వివరాలను జిల్లా పోలీసు ఉన్నత అధికారులు తీసుకుంటున్నారు. ఈ సర్వే భవిష్యత్‌లో నేరాల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగపడనుంది.

సర్వర్‌తో అనుసంధానం..
జిల్లా పోలీసు శాఖ సేకరించిన నేరస్తుల సమాచారం మొత్తాన్ని పోలీసు శాఖలోని డేటాబేస్‌ సర్వర్‌తో అనుసంధానం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లా పోలీసులైనా సర్వర్‌ ఆధారంగా నేరగాళ్ల గుట్టు కనిపెట్టవచ్చు. ఎక్కువ నేరాలు పాత నేరగాళ్లే పాల్పడుతుంటారని పోలీసు శాఖ అంచనా. ఎక్కడైనా, ఏదైనా నేరం జరిగితే ఈ డేటా బేస్‌ ఆధారంగానే నిందితులను గుర్తిస్తారు. దీంతో విచారణ వేగవంతమవుతుంది. నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారుల ఆలోచన మేరకు ప్రతీ కేసుకు సంబంధించిన వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

గృహాలకు జియో ట్యాగింగ్‌..
జిల్లాలో ఉన్న నేరస్తుల గృహాలకు సైతం గూగుల్‌ మ్యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ సర్వేలో ప్రధానంగా దొంగతనాలు చేసే నేరస్తులపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపనుంది. నేరస్తుల ఇళ్లకు జియో ట్యాగింగ్‌ చేసి పెట్రోలింగ్, బ్లూకోట్స్‌ వాహనాల, సిబ్బంది వద్దనున్న ట్యాబ్‌లలో పొందుపర్చనున్నారు. దీని వల్ల దొంగతనాలు జరిగిన సందర్భాల్లో కదలికలు కనిపెట్టడం సులభతరమవుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గతంలో రాష్ట్రంలోని హైదరాబాద్, సైబర్‌బాద్‌ ప్రాంతాల్లోని నేరస్తుల ఇళ్లకు జియోట్యాగింగ్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టేందుకు పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా మహారాష్ట్రకు ఆనుకొని ఉండడంతో ఇక్కడ దొంగల ప్రాబల్యం ఎక్కువ. ఇతర రాష్ట్రాల దొంగలే కాకుండా జిల్లాలో సైతం దొంగలు ఎక్కువగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతీ దొంగతనం కేసుల్లో పోలీసులకు పట్టుబడ్డ వారిలో జిల్లాకు చెందిన వారు సగం, మహారాష్ట్రకు చెందిన వారు కొంత మంది ఉంటారు. ఈ సర్వే తర్వాత జిల్లాలకు చెందిన నేరస్తుల వివరాలు పూర్తిగా తెలియనున్నాయి. జిల్లాలో ఎలాంటి దొంగతనం జరిగినా వెంటనే తెలిసిపోయే అవకాశం ఉంటుంది.  

సర్వే చేపడుతున్నాం..
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 18న నేరస్తుల సమగ్ర సర్వే చేపట్టనున్నాం. ఇప్పటికే ప్రతి పోలీసు స్టేషన్‌ నుంచి వివరాలు సేకరిస్తున్నాం. 18న జిల్లా వ్యాప్తంగా సర్వే చేసి నేరస్తుల పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ఆ తర్వాత వారం రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వివరాలన్నీ పోలీసు డాటేబేస్‌లో అనుసంధానం చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నేరస్తుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నేరస్తుడి కదలికలు తెలుసుకోవచ్చు. – విష్ణు ఎస్‌ వారియర్, ఎస్పీ, ఆదిలాబాద్‌

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top