తాగునీటి కటకట

peoples facing problems with water scarcity - Sakshi

ఇస్పూర్‌ వాసులకు చెలిమెనీరే దిక్కు

ఇబ్బందుల్లో గ్రామస్తులు

పట్టించుకోని అధికారులు

నేరడిగొండ : అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. నేరడిగొండ మండలంలోని రాజు గ్రామపంచాయతీ పరిధిలో గల ఇస్పూర్‌ చిన్నగోండుగూడలో సమస్యలు తిష్ట వేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 50 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వ్యవస్థ అధ్వానంగా మారడంతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇక్కట్లు
గ్రామంలో శీతాకాలంలోనే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నీటిని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. అయినా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించిన దాఖలాలు లేవని వారు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన చేతిపంపు పనిచేయకపోవడంతో అదే గ్రామానికి చెందిన సిడాం రాము రూ.3లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేయించినా తాగునీటి సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గ్రామ సమీపంలో చెలిమె ఏర్పాటు చేసుకొని కలుషిత నీటినే తాగాల్సి దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి విద్యుత్‌ సమకూర్చినా ఇంటికి విద్యుత్‌ తీసుకోవడానికి అనువుగా లేకపోవడంతో గ్రామస్తులందరు ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ తీసుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
  
గ్రామంలో అధ్వానంగా వీధులు 
గ్రామంలో పలు వీధులు అధ్వానంగా మారడంతో ఉండడానికి అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. వేసవికాలం వచ్చిందంటే తాగునీటి సమస్య జఠిలమవుతుందని, అధికారులకు విన్నవించినా మా గ్రామానికి ఇప్పటివరకు ఏ అధికారి వచ్చిన దాఖలాలు లేవని వారు వాపోతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

సమస్యలు పరిష్కరించాలి 
గ్రామంలో తాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నీరే దిక్కవుతుంది. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా తాగునీటిని అందించి ఆదుకోవాలి. 
 – సిడాం జయవంత్‌రావు, గ్రామస్తుడు 

దినమంతా చెలిమెల వద్దే 
ఉదయం నుంచి సాయంత్రం వ రకు  చెలిమెల వద్దే ఉంటున్నాం. గత్యంతరంలేక కలుషితమైన నీటినే తాగుతున్నాం. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలి. 
– సిడాం కవిత, గ్రామస్తురాలు  

సమస్య మా దృష్టికి రాలేదు 
ఇస్పూర్‌ చిన్నగోండుగూడలో ఉన్న తాగునీటి సమస్య మా దృష్టికి రాలేదు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తాం. ఇతర సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. 
– ప్రభాకర్, ఈవోపీఆర్డీ, నేరడిగొండ 

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top