గుట్కా.. ‘మహా’ జోరు

Gutka, khaini secretly sold in roadside shops in adilabad - Sakshi

జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్న దందా

నిషేధం మరో ఏడాది పొడిగించిన ప్రభుత్వం

రెండేళ్లలో 157 కేసులు నమోదు, 170 మంది అరెస్టు

మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా

ఆదిలాబాద్‌ : జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతోంది. ప్రతి ఏడాది లక్షల విలువ చేసే గుట్కా మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా అవుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నా వ్యాపారుల దందా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఏడాది పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నికోటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించింది. 2013 నుంచి రాష్ట్రంలో గుట్కాపై నిషేధం విధిస్తూ గతేడాది విధించిన ఉత్తర్వుల గడువు బుధవారంతో ముగిసింది. దీంతో మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది రాష్ట్రంలోని పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో మట్కా, గుట్కాలపై ప్రభుత్వ నిషేధం ఉందని, దీనిపై పోలీసులు నిఘా పెట్టి నిరోధించాలని సూచించిన విషయం తెలిసిందే. గుట్కాపై పోలీసులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నా గుట్టుచప్పుడు కాకుండా గుట్కా దందా సాగిస్తున్నారు. సరైన నిఘా లేకపోవడం.. నిరంతరం దాడులు నిర్వహించకపోవడంతో అక్రమదారులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పలుమార్లు దాడులు నిర్వహించి అరెస్టు చేసినప్పటికీ అసలు సూత్రధారులను పట్టుకోకపోవడంతో అక్రమార్కులు షరామామూలుగా తీసుకుంటున్నారు.

మహారాష్ట్ర నుంచి రవాణా..
జిల్లాలో గుట్కా వ్యాపారం గుప్పుమంటోంది. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండడంతో మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం గుట్కా, పాన్‌మసాలా, ఖైనీ, జర్దాలు పొగాకు రా ఉత్పత్తులపై నిషేధం విధించినా జిల్లాలో అది అమలు కావడం లేదు. జిల్లా కేంద్రంలో గోదాముల్లో, ఇతర ప్రాంతాల్లో ట్రేడర్స్, కిరాణాషాపులు, పాన్‌షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. గోదాములను అద్దెకు తీసుకొని పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుతున్నారు. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రతోపాటు కర్ణాటక, హైదరాబాద్‌ నుంచి గుట్కాలు దిగుమతులు అవుతున్నట్లు తెలుస్తోంది. డీలర్లు, సబ్‌డీలర్లు, పట్టణాలు, మారుమూల గ్రామాలకు వీటిని చేరవేస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ ప్రాంతాలకు గుట్కా రవాణా అవుతోంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌చౌక్, నేతాజీచౌక్, వినాయక్‌చౌక్‌లోనే గుట్కా దందా ఎక్కువగా సాగుతోంది. అంబేద్కర్‌చౌక్‌లో ఓ బడా వ్యాపారి గుట్కా దందాకు ఫేమస్‌. ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకు గుట్కా సరఫరా అవుతోంది. అంబేద్కర్‌ చౌక్‌లోని మసీదు ఏరియా ప్రాంతంలో ఈ దందా సాగుతుందని తెలిసినప్పటికీ పోలీసులు అటు వైపు నిఘా పెట్టకపోవడం గమనార్హం. దీంతో రూపాయికి దొరికే గుట్కా ప్యాకెట్‌ను రూ.3 నుంచి రూ.5 వరకు అమ్ముకొని లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. ఇది ఆయా ప్రాంతాల నుంచి చిన్న షాపులకు వెళ్లే వరకు ధర రూ.10కి చేరుతోంది.

గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లాలో గుట్కా కేంద్రాలపై నిఘా ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో దాడులు సైతం నిర్వహిస్తున్నాం. గుట్కా విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. నిషేధిత గుట్కా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు సైతం ఇందుకు సహకరించాలి. – నర్సింహారెడ్డి, ఆదిలాబాద్‌ డీఎస్పీ

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top