మైదానంలో క్రికెటర్లు కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించడం సర్వ సాధారణం. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూ రెచ్చగొట్టే యత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా బ్యాట్స్‌మన్-బౌలర్ పోరు కూడా తరచు కనిపిస్తూ ఉంటుంది. వీరు ఒకర‍్ని ఒకరు స్లెడ్జింగ్ చేసుకోవడం ఒకటైతే, అసహనంతో బంతిని బ్యాట్స్‌మన్‌పైకి విసిరేసే సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇలా సహనం కోల్పోయిన తర్వాత సదరు బౌలర్.. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు సారీ చెప్పడం కామన్. కాకపోతే ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ చేసిన పనిలో క్రీడా స్ఫూర్తి లోపించినట్లు కనిపించింది. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను బంతితో కొట్టినా దానికి ఎటువంటి క్షమాపణ కోరకపోవడం ఫీల్డ్‌లో ఉన్న క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. అది అనవరసపు త్రో అనే విషయం అభిమానులకు కనిపిస్తున్నా సౌథీ చేసి యాక్షన్ ఇంకా విసుగు తెప్పించింది.