- ఆమదాలవలసలో చీటీలు ఇచ్చి వదిలేసిన అధికారులు
- అల్లాడుతున్న రైతులు
- దివ్యాంగుడైన భర్తను ఇంటి వద్దే వదిలి వచ్చానని ఓ మహిళా రైతు ఆవేదన
ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమదాలవలసలోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణం వద్దకు గురువారం ఉదయం యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి పడిగాపులు కాశారు. రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన చీటీలతో రాగా... మిషన్ పని చేయడంలేదని షాపు వాళ్లు చెప్పడంతో రోజంతా ఎదరుచూసి సాయంత్రం నిరాశగా వెనుదిరిగారు. వారం రోజులుగా తిరిగితే ఒక రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తామని చీటీలు ఇచ్చారని, తీరా ఇప్పుడు ఎరువులు లేవని చెబుతున్నారని పలువురు రైతులు వాపోయారు.
ఈ ప్రభుత్వానికి నా ఉసురు తగులుతుంది..
నా భర్తకు పక్షవాతం వచ్చి కాలు, చెయ్యి పనిచేయడంలేదు. నేనే కొంతభూమి పండించుకుంటున్నాను. ఆ భూమికి 10 కిలోల యూరియా మాత్రమే అవసరం. దానికోసం మూడు రోజులు మా ఊరిలోని సచివాలయం చుట్టూ తిరిగాను. వాళ్లు ఆమదాలవలసలోని ప్రైవేట్ దుకాణానికి వెళ్లాలని చీటీ రాసిచ్చారు. ఆ చీటీ పట్టుకుని దుకాణదారుని వద్దకు మూడు రోజులుగా తిరుగుతున్నాను. అయినా ఇవ్వడంలేదు. మిషన్ పోయిందని చెబుతున్నారు. నా భర్తకు కాలు, చెయ్యి పని చేయకపోవడంతో ఆయనకు తిండిపెట్టే దిక్కులేదు. రోజూ ఆయన్ను విడిచిపెట్టి రావడం నరకంగా ఉంది. నా ఉసురు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగలక తప్పదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. నాతోపాటు మా గ్రామంలో సుమారు వంద మంది రైతులది ఇదే పరిస్థితి.
- పిట్ట రాజు, మహిళా రైతు, వెంకయ్యపేట, ఆమదాలవలస మండలం