ప్రొద్దుటూరు/ఖాజీపేట/మైదుకూరు/దువ్వూరు: ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అనుకున్న ప్రకారమే ఏకగ్రీవం చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లో మేజర్ పంచాయతీలైన కొత్తపల్లె, గోపవరం, సోములవారిపల్లె గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల మూడు రోజులూ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి సూచనల మేరకు టీడీపీ గుండాలు నామినేషన్ కేంద్రాల వద్ద కాపు కాశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి నామినేషన్ల కోసం హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు అరకొరగా నామినేషన్లను వేయించారు. వాటిని సైతం స్క్రూటినీలో అకారణంగా తొలగించారు.
60వేల మంది ఓట్లు వేయకుండా చేశారు
ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె, గోపవరం, సోమువారిపల్లె మూడు మేజర్ గ్రామ పంచాయతీల్లోని సుమారు 60వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండా ఖాకీలు, పచ్చ నేతలు అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఈ మూడు మేజర్ గ్రామ పంచాయతీల్లో నాటి నుంచి నేటి వరకు ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను ఓటర్లు చవిచూడలేదు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో దాదాపు 30 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వర్గీయులే విజయం సాధిస్తున్నారు. తమ అభ్యర్థులు విజయం సాధించలేరనే కారణంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థి శేఖర్ యాదవ్ నామినేషన్‌ను చెల్లుబాటు కాకుండా చేశారు.
ఆర్‌ఓల తీరుకు నిరసనగా ధర్నా
ఖాజీపేట మండలంలోని 6 క్లస్టర్లలోని ఆర్‌ఓలు ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ మద్దతుదారుల నామినేషన్లుతోపాటు అధికారపార్టీకి రెబల్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారి నామినేషన్లను కూడా చెల్లని నామినేషన్లుగా తిరస్కరించారు. దువ్వూరు మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 43 నామినేషన్లు దాఖలు చేయగా. మంగళవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో భాగంగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులనే ఉద్దేశంతో 41 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించారు. చిన్న చిన్న కారణాలను చూపుతూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లు తిరస్కరించారని నామినేషన్ వేసిన వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్‌ఐ ఓవర్‌యాక్షన్ ..రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన రెడ్యం సోదరులు
ఖాజీపేట మండలం చెమ్ముళ్ల పల్లె సచివాలయం వద్ద సజావుగా జరగాల్సిన నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం ఎస్‌ఐ ఓవరాక్షన్ తో ఉద్రిక్తతకు దారి తీసింది. దుంపలగట్టు సర్పంచ్ అభ్యర్థి, తన నామినీతో పాటు పత్రాల పరిశీలనకు వెళ్లగా పోలీసులు, ఎస్‌ఐ అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,ఆయన సోదరుడు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి ఇద్దరు అభ్యర్థులను పంపాలనే నిబంధన ఉంది కదా అని చెప్పారు. పోలీసులు వినకుండా తీవ్ర పదజాలంతో వారిని దుర్భాషలాడారు. దీంతో ఇరువురి మధ్య ఉద్రిక్తత నెలకొంది. కాగా నామినేషన్ పత్రాలను అధికారులు పూర్తిగా తిరస్కరించడంతో ఆర్‌ఓ తీరును రెడ్యం సోదరులు తప్పుపట్టారు.ఆర్‌ఓ డబ్బులుకు అమ్ముడుపోయారని ఆరోపించారు.
చాపాడు : పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నాటికి 14 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయగా మంగళవారం జరిగిన స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ కాగా, నలుగురివి మాత్రమే ఆమోదం పొందాయి. తిరస్కరణ అయిన నామినేషన్ పత్రాలలో అన్ని రకాలుగా నింపామని, ఎలాంటి తప్పులు లేకున్నా ఆర్‌ఓలు తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు వాపోయారు. స్క్రూటినీ సందర్భంగా చాపాడు క్లస్టర్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య తోపులాట జరగగా పోలీసులు అడ్డుకున్నారు.
దువ్వూరు మండలంలో ఇడమడక, కృష్ణంపల్లె, నేలటూరు, గుడిపాడు, వెంకుపల్లె తదితర గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సర్పంచ్ స్థానాల కోసం వేసిన అన్ని నామినేషన్లను ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతల ఆదేశాలతో పూర్తిగా తిరస్కరించారు.


