‘ఇదేమి రాజకీయమబ్బా....ఏమర్థం కావ డం లేదే! .. మా కాలంలో ఓట్లు వచ్చినాయంటే ఊర్లో ఎవడు మొగోడో తేల్చుకోవాలని తాడో పేడో అంటూ దుంకేవాళ్లం. ఇప్పుడేందబ్బా....రాజకీయమంటే పోలీసోళ్లు చేస్తాండారు....ఎప్పుడు మొఖాలే చూడనోళ్లు మన ఊర్లోకి వచ్చి బయపెడతాండారు. కట్టెలు పట్టుకుంటారు...రాడ్లతో బూతులు మాట్లాడుతా మీదిమీదికి వచ్చాండారు. ఫ్యాక్షన్‌ను చూశాం....ముఠాకక్షలు ఎదుర్కొన్నాం...కానీ, ఇదేందిది.. గలీజు పనిలాగా ఎవరెవరో వచ్చి వీధుల్లో పిచ్చి చేష్టలు చేస్తాండారు. ఎదురుగా రాకుండా.... పోలీసోళ్ల ద్వారా బెదిరిచ్చ డమేంది....’ కూటమి సర్కార్‌లో నాయకులు చేస్తున్న వింత పోకడలపై రచ్చబండ వద్ద రాజకీయ ఉద్దండుల ఆవేదన ఇది. ప్రస్తుతం చుట్టుపక్కల జరుగుతున్న ఎల్లచ్చన్లను.. పాత తరంలో జరిగే ఎలచ్చన్లను బేరీజు వేసుకుంటాండారు.
ఇట్టనా రాజకీయం చేసేది ?
‘ఏందిరా...మన ఏరియాలో ఇట్టా రాజకీయం. ఎన్నికలంటే ఊర్లో ఒక జాతర లాగా, వారం, పది రోజులు పోటాపోటీగా తిరిగేవారం. ఎలెచ్చన్లు అనగానే పొద్దున, సాయంత్రం నిద్దర లేకుండా తిరుగుతూ అందర్ని కలేసేవాళ్లం. గొడవొస్తే సళ్లుకొనే పరిస్థితి ఉండేది కాదు... ఎలెచ్చన్ల ముందునుంచి అయిపోయేవరకు ఎవరికి వారు వర్గాలుగా రాజకీయం చేసేటోళ్లం. ఇదేంటో ఇప్పుడు కొత్తగా ఎవరిని నామినేషన్లకు పోనీయకుండా అడ్డుకుంటూ రాజకీయం చేస్తాండారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇట్టాలేదురాబ్బీ.. ఎలెచ్చన్ రోజు ఎవరి శక్తి మేర వాళ్లు చూసుకునేవారు. ప్రజల్లో బాగా పేరుండి పట్టు ఉన్నోన్లు మాత్రమే గెలుచ్చాండారు. ఇప్పుడా నామినేషన్ లేదు...ఎక్కడైనా ఎలెచ్చన్ జరుగుతాన్నే అక్కడ కూడా ఎవరో కొత్తోళ్లు వచ్చి ఓట్లు వేచ్చాండారు. పోలీసు సార్లు అడ్డుకోమంటే వాళ్లు కూడా ఓటేయడానికి వచ్చినోళ్లనే ఎనక్కి తరుముతాండారు.. ‘సార్ మా ఓట్లు ఎవరో ఏసుకుంటున్నా’రన్నా ‘ఔనా’...అన్నట్లు ఊరకుండారు. మా ఊరికొచ్చి మా ఓట్లు లోపల ఉండేవాళ్లు మా ప్రమే యం లేకుండా వాళ్లకు ఇచ్చిమొచ్చిన పార్టీకి వేసుకుంటాండారు. ఇదంతా కొత్త రాజకీయంగా ఉందబ్బా....పవరుందని ఎవరిని ఓట్లేయనీకుండా దౌర్జ న్యం, రౌడీయిజంతో తెల్లారుజామునుంచే మొదలుపెట్టి దొంగ ఓట్లు వేసుకోవడం ఇప్పుడు కాలానికే చెల్లిందిలేబ్బా...ఇంత జరుగుతున్నా మౌనంగా చూస్తున్న.. కాదు.. కాదు దౌర్జన్యానికి ఉసి గొల్పుతున్న అధి కారుల చదువులు ఎందుకు..ఏడ్సనీకా.
కాగితాలు గుంజుకోవడం ఏందిరా!
మాటమీద నిలబడటం, పార్టీ నాయకుడి దగ్గర నిజాయితీగా ఉండడం...ఇవన్నీ అప్పుడు కాలంలో కనిపించేవి. రాజకీయంగా కూడా ప్రత్యర్థులైనా ఎదురెదురుగా పార్టీల పరంగా తెల్చకుంటున్నారు కానీ, ఇట్లా దొంగ దెబ్బ తరహాలో రాజకీయం ఉండేది కాదు. గెలుపు, ఓటమి అట్టా పక్కనబెడితే వర్గాలుగా ఉంటూ ప్రజలను ప్రాధేయపడి ఓట్లు వేయించుకునేవాళ్లం. ఇప్పుడేందోనామినేషన్ వేయనీరు..ఓట్లేయనీరు... పాలకపక్షంలోని సార్లందరూ వాళ్లకే జై అంటారు...ఇక ఈ సంబడానికి ఎన్నికల పేరు చెప్పడం ఏమిటో అర్థమయ్యే చావడం లేదు. ఆడాళ్ల మీద అడ్డంగా దాడులు చేస్తున్నా....నామినేషన్ పత్రాలు చిన్నపిల్లోళ్లలాగా గుంజుకోవడం ఎప్పుడూ చూళ్లేదురా నాయనా. అక్కడక్కడా ఆడోళ్లు ధైర్యంగా నిలబడి ఎలెచ్చన్ చేయాలి...ఓట్లు వేయించుకుని గెలవాలీగానీ, ఈ పద్ధతి ఏంటని గట్టిగా నిలబడ్డం చూస్తే మహిళా ధీరత్వం కనిపిస్తోంది.ఏమాటకామాట ఈ ఎన్నికల దుర్మార్గం పెజాస్వామ్యానికి మచ్చే. ఇలాగే సాగితే ఈ కూటమి పాలకులు కనుమరుగవడం ఖాయమే. – సాక్షి కడప


