కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని దిగుమతిదారు లు, మిల్లర్లు, టోకు, చిల్లర వ్యాపారులు తమ వద్ద ఉన్న వరి, బియ్యం, నూకలు, కందులు, మినుములు, శనగలు, పెసల వివరాలు తెలియజేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురామ్ ఒక ప్రకటనలో కోరారు. హెచ్‌టీటీపీఎస్://ఎఫ్‌సీఏఐఎన్‌ఎఫ్‌ఓడబ్ల్యుఈబీ.ఎన్‌ఐసీ.ఇన్/పీఎస్‌పీ/ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. వరి, బియ్యం నిల్వల వివరాలు హెచ్‌టీటీపీఎస్://ఎఫ్‌ఓఓడీఎస్‌టీఓసీకే.డీఎఫ్‌పీడీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం సదరు వివరాలను అప్‌డేట్ చేయాలని సూచించారు. బియ్యం వ్యాపారులంతా వరిధాన్యం, బియ్యం నియంత్రణ ఉత్తర్వులు–2026లోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఏడు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల జిల్లాలోని పలు మండలాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. ఇందులో భాగంగా టి. సుండుపల్లిలో 7.4 మి.మీ, రాజంపేటలో 6.8, నందలూరులో 4.2, బిమఠంలో 3, వీరబల్లిలో 2.6 , గోపవరంలో 2, బద్వేల్‌లో 1.8 మి.మీ వర్షం కురిసింది.
అమరావతిలో
‘బెంగుళూరు’కు రాయితీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీకి సంబంఽధించి బెంగుళూరుకు వెళ్లే అమరావతి బస్సు సర్వీసు ఛార్జీలో 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి రోజు అమరావతి బస్సు కడప నుంచి బెంగుళూరుకు మధ్యాహ్నం 1.30, 3.00, రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుందన్నారు. అలాగే బెంగుళూరు నుంచి కడపకు మధ్యాహ్నం 2.30, రాత్రి 11.15, 11.45 అమరావతి సర్వీసులు ఉన్నాయన్నారు. తగ్గింపు అవకాశం డిసెంబరు 31 వరకు అమలులో ఉంటుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
నవగ్రహాలు బహూకరణ
వీరపునాయునిపల్లె : మండలంలోని అనిమెల సంగమేశ్వరునికి 70 లక్షల రూపాయల విలువ గల వెండి నాగాభరణం, నవగ్రహ పంచలోహ విగ్రహాలను కడప పట్టణంలోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర్‌రెడ్డి బహుకరించారు. ఆభరణాలను ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ, ఆలయ ఈఓ మారుతీ ప్రసాద్‌లకు కార్త్తిక పౌర్ణమి సందర్బంగా అందజేశారు. ఆభరణాలను అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వమించి దాతలచే స్వామివారికి అలంకరించారు.
ఎన్నికలకు పటిష్ట చర్యలు చేపట్టాలి
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, అదే రోజు జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పా ట్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ బోర్డు సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌తోపాటు జేసీ డాక్టర్ నిధి మీనా, జిల్లా పంచాయతీ అధికారి రామచంద్ర తదితరులు పాల్గొనగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తన ఛాంబర్ నుంచి వీసీలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.


