● రైల్వేమంత్రి వైష్ణవ్ హామీ
● పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశం
● ఫలించిన ఎంపీ మేడా కృషి
రాజంపేట : జిల్లాలో రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణానికి రైల్వేమంత్రిత్వశాఖ అంగీకరించింది. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డికి రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ లేఖ ద్వారా తెలియచేశారు. ఈ విషయాన్ని ఎంపీ ధ్రువీకరించారు.
హైవే కనెక్టివిటీగా ఆర్వోబీ నిర్మాణం
నందలూరు రైల్వేకేంద్రానికి కొద్దిదూరంలో పడమర దిశలో నాగిరెడ్డిపల్లె శివారులో కడప–రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కొనసాగుతోంది. ఈ హైవే కనెకట్టివిగా నందలూరు రైల్వేపాత గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణం ఆవశక్యతను ఎంపీ రైల్వేమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. కొన్నేళ్లుగా స్థానికులు ఎంపీకి ఆర్వోబీ నిర్మాణం గురించి విన్నవిస్తూ వస్తున్నారు. దీంతో ఎంపీ మేడా సంబంధిత మంత్రిత్వశాఖతో పలుసార్లు మాట్లాడారు. తాజాగా ఆయన కృషి ఫలించి ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి వైష్ణవ్ హామీ ఇచ్చారు. నందలూరు రైల్వేకేంద్రంలో ఉన్న 111 పాతగేటు స్థానంలో ఆర్వోబి నిర్మాణం కోసం ఎంపీ మేడా రఘునాథరెడ్డి కృషి ఫలించడంపై నందలూరు ప్రాంతంలో హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
హైవేకనెక్టివికి అనుకూలంగా లేని రెండు ఆర్‌యూబీలు
ప్రస్తుతం ఉన్న రెండు ఆర్‌యూబీలో హైవే నుంచి రాకపోకలు సాగించడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయి. ఫలితంగా ఆర్వోబీ నిర్మాణం తప్పనిసరి. కాగా ఆర్వోబి నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్నే ఎంచుకుంటారా... లేక గొల్లపల్లె దారిలో ఉన్న పాతక్యాబిన్ వద్ద భూసేకరణ చేసి ఆర్వోబీ నిర్మిస్తారా చూడాలి. రైల్వే అధికారుల పరిశీలన తర్వాత రైల్వే సర్వే ఆధారంగా ఆర్వోబీ నిర్మాణ స్ధలం నిర్ణయించనున్నారు.
పర్యాటకులకు ఎంతో మేలు
ఆర్వోబీ నిర్మాణం వల్ల హైవేలో వెళ్లే పర్యాటకులు, యాత్రీకులు, ప్రజలు నేరుగా నందలూరు సర్వీసురోడ్డు(ప్రస్తుత హైవే)లోకి వెళ్లేందుకు వీలుంటుంది. ఫలితంగా దక్షిణభారతదేశంలో అతి పెద్ద వైష్ణవ ఆలయంతోపాటు సమీపంలోని తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం, టీటీడీ శ్రీవారి ఆలయం, సీమలో తొలిసారిగా బయల్పడ్డ భౌద్ధరామాలును సందర్శించేందుకు సౌకర్యంగా ఉంటుంది.


