కడప సిటీ : విశ్వాసానికి ప్రతీకగా మరియ తల్లి నిలుస్తోందని రెవరెండ్ ఫాదర్‌ప్రవీణ్ తెలిపారు. కడప నగరంలోని ఆరోగ్యమాత చర్చిలో ఆరోగ్యమాత తిరునాల మహోత్సవంలో భాగంగా రెండవరోజు ఆదివారం మరియతల్లి జన్మదిన వేడుకల సందర్భంగా తేరును అలకరించి పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ప్రార్థనలతో విశ్వాసులు ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ తేరు, పీఠాన్ని బచ్చుంపల్లి విచారణ గాయక బృందం అలంకరించారు. తొలుత దివ్య బలిపూజను రెవరెండ్ ఫాదర్ బ్రిట్టో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రవీణ్ మాట్లాడుతూ మన కష్టాలను, బాధలను ప్రభువు ముందు ఉంచి మన కోసం ప్రార్థించి మన వెంట నడిచే గొప్ప తల్లి మరియమాతగా వివరించారు. ఆమె చెప్పిన మాటలు మన జీవితానికి ఎంతో మార్గదర్శకమన్నారు. ప్రతిరోజు ప్రార్థించి మరియతల్లి ఆశీస్సులు పొందాలని ఆయన సందేశంలో వివరించారు. రెవరెండ్ ఫాదర్ ఎల్.ఆరోగ్య స్వామి, గురువులు, కన్యసీ్త్రలు, తిరునాల కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు.


