పాత్రధారులకు శిక్షతో సరిపోతుందా! | - | Sakshi
Sakshi News home page

పాత్రధారులకు శిక్షతో సరిపోతుందా!

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

‘పచ్చ’గా గంజాయి దందా..

పెద్దతిప్పసముద్రం/ప్రొద్దుటూరు క్రైం : ఒకప్పుడు సాగునీరు, పాడిపంటలతో ప్రశాంతతకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన రాయలసీమ గడ్డ.. నేడు మత్తు పదార్థాల వ్యాపారులకు కాసుల వర్షం కురిపించే అడ్డాగా మారుతోంది. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా విభజన తర్వాత ఏర్పాటైన కడప, అన్నమయ్య జిల్లాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా, వినియోగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మారుమూల పల్లెల నుంచి నగరాల నడిబొడ్డు వరకు గంజాయి మహమ్మారి విచ్చలవిడిగా లభ్యమవుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో, పాత నేరస్థులు సైతం ఎటువంటి భయం లేకుండా బెంగళూరు, ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ దిగుమతి చేసుకుంటూ యువతను సర్వనాశనం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టి.సదుం క్రాస్‌ వద్ద 2 కిలోల గంజాయి..

పాత నేరస్థుడికి పచ్చజెండా!

అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో తాజాగా జరిగిన గంజాయి పట్టివేత ఉదంతం క్షేత్రస్థాయిలో సాగుతోన్న అక్రమ వ్యాపారానికి నిలువెత్తు అద్దం పడుతోంది. మండలంలోని టి.సదుం క్రాస్‌ వద్ద పోలీసులు జరిపిన మెరుపు తనిఖీల్లో రెండు కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలోని బెంగళూరు రోడ్డు, గిరిరావ్‌ వీధికి చెందిన గంగిశెట్టి శివకుమార్‌ (22) అనే నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడి గత చరిత్రను పరిశీలించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గతంలోనూ బెంగళూరులో గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ మదనపల్లి వన్‌ టౌన్‌, టూ టౌన్‌ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు.

ప్రొద్దుటూరు శివారులో

3.5 కిలోల సరుకుతో ’అనిల్‌’ అరెస్ట్‌!

మరోవైపు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ శివారులోని కొత్తపల్లె సర్కిల్‌ వద్ద ఎకై ్సజ్‌ పోలీసులు జరిపిన దాడిలో అంతర్రాష్ట్ర గంజాయి నెట్‌వర్క్‌ మరో ముక్క బయటపడింది. ఎకై ్సజ్‌ సీఐ సురేంద్రారెడ్డి, కడప ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.నీలకంఠారెడ్డిలు సంయుక్తంగా మైదుకూరు రోడ్డులో తనిఖీలు చేపట్టారు. కొత్తపల్లె సర్కిల్‌ వద్ద ప్లాస్టిక్‌ సంచిని చేతిలో పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న పెరుగు అనిల్‌ కుమార్‌ అనే యువకుడు, అధికారుల వాహనాలను చూసి అకస్మాత్తుగా పారిపోవడానికి ప్రయత్నించగా ఎకై ్సజ్‌ సిబ్బంది వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. కమలాపురం మండలంలోని సంబటూరు గ్రామానికి చెందిన పెరుగు అనిల్‌ గతంలో వ్యాపారం చేసేవాడు. ఇటీవల నష్టాలు రావడంతో కుటుంబ పోషణ సాకుతో, సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి దందాలోకి దిగాడు. ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురం ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఈ గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నట్లు నిందితుడు ఎకై ్సజ్‌ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 3.5 కిలోల ఎండు గంజాయి విలువ మార్కెట్‌లో రూ. 40 వేల పైనే ఉంటుందని అధికారులు నిర్ధారించారు.

గతంలో భారీ నెట్‌వర్క్‌లపై వేటు..

నేడు పాలకుల ఉదాసీనత!

కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి ముఠాల కదలికలు కొత్తేమీ కాదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పీటీఎం–ములకలచెరువు మండలాల సరిహద్దు ప్రాంతమైన సండ్రడవి వద్ద ఏకంగా 104 కిలోల గంజాయితో పాటు 12 మంది నిందితులను వాహనాలతో సహా పట్టుకుని యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.కానీ కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత మళ్లీ పాత నెట్‌వర్క్‌లు పుంజుకున్నాయి. అధికార పార్టీ నేతలు జూదం, క్రికెట్‌ బెట్టింగులు, ఇసుక, మట్టి మాఫియాల్లో మునిగితేలుతూ సొంత లాభాలు చూసుకుంటున్నారే తప్ప, జిల్లాలో యువతను నిర్వీర్యం చేస్తోన్న గంజాయి కట్టడిపై చిత్తశుద్ధి చూపడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ నల్లమందు సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు సిసలైన ’పెద్ద తలకాయల’ను ఎందుకు పట్టుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రెండు జిల్లాలను డ్రగ్స్‌ రహితంగా మార్చాలంటే కేవలం చిన్న చిన్న పాత్రధారులను కాకుండా, అధికార పార్టీ అండతో చెలరేగిపోతోన్న ప్రధాన గంజాయి మాఫియా డెన్లపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

గ్రామాలకు పాకిన మహమ్మారి..

గాడి తప్పుతున్న యువత!

గతంలో కేవలం పెద్దపెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన గంజాయి అమ్మకాలను వ్యాపారస్థులు నేడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరింపజేశారు. ప్రొద్దుటూరులో పట్టుబడిన అనిల్‌, పరిసర ప్రాంతాల్లోని కళాశాల విద్యార్థులకు, రోజువారీ కూలీలకు నిత్యం గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. గంజాయి అమ్మకాలు, వినియోగానికి ఊరి చివర ప్రాంతాలు, ప్రహరీ గోడల వెనుక, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాగా మార్చుకుని విక్రేతలు దర్జాగా దందా సాగిస్తున్నారు. పరిసర మండలాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతుండటంతో యువత మత్తులో మునిగి తేలుతోంది. మత్తుకు బానిసలైన యువత తమ జీవితాలను అర్ధాంతరంగా చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కన్నవాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ‘పచ్చ‘నోట్ల కక్కుర్తి కోసం సాగుతున్న ఈ గంజాయి దందా.. పచ్చని జిల్లాల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తోంది. పాలకపార్టీలకు చెందిన కొందరు నాయకుల అండతో సాగుతున్న ఈ అక్రమ నెట్‌వర్క్‌ను తక్షణమే ఉక్కుపాదంతో అణచివేయకపోతే యువత మత్తు ఊబిలో శాశ్వతంగా కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.

కూటమి రాజ్యంలో బార్లా తెరిచిన

అంతర్రాష్ట్ర సరిహద్దులు

పల్లె పల్లెకూ విస్తరిస్తున్న మహమ్మారి!

ఒరిస్సా, బెంగళూరు డ్రగ్స్‌ మాఫియాతో పాత నేరస్థుల లింకులు

వరుస పట్టివేతలతో కదులుతున్న నెట్‌వర్క్‌!

సూత్రధారులను పట్టుకునేదెన్నడు?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement