నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించగా రూ.5,93,130 వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. 30 రోజులకు సంబంధించి ఆదాయం లెక్కించినట్లు చెప్పారు. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి ఏసుదాసు, భక్తులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ రుణం పేరుతో మోసం
ముద్దనూరు : స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ ద్వారా రుణం మంజూరు చేస్తామంటూ ప్రకటన చూసి ఓ ఆటోడ్రైవర్ మోసపోయాడు. స్థానిక పాతవీధికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్‌లో రుణ ప్రకటనచూసి హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధిని సంప్రదించాడు.ఆధార్,పాన్‌కార్డు పంపిస్తే రూ.5లక్షలు రుణం మంజూరు చేస్తామని తెలిపారు.ఇందుకుగాను మొదటి రూ.26వేలు చెల్లించాలని తెలిపారు.ఫోన్ ద్వారా రూ.26వేలు చెల్లించిన తర్వాత మరో విడతో రూ.3వేలు చెల్లించాడు.తన ఖాతాలో సొమ్ము ఎప్పుడు వేస్తారని ఆటోడ్రైవరు సంస్థ ప్రతినిధిని ఆడగ్గా.. మరో రూ.5300లు ఫోన్‌ఫోచేస్తే 5 నిమిషాల్లో రూ.5లక్షల రుణం మీ ఖాతాల్లో జమ అవుతుందని ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు.అయితే అప్పటికే సుమారు రూ.30వేలు నష్టపోయిన ఆటోడ్రైవర్‌కు పలువురు ఇదంతా మోసమని తెలియజెప్పడంతో బాధితుడు డబ్బునష్టపోవడమే కాకుండా తీవ్ర నిరాశకు గురయ్యాడు.
మైదుకూరు ఏఎంసీ కార్యదర్శి సస్పెన్షన్
మైదుకూరు : మైదుకూరు వ్యవసాయ మార్కె ట్ కమిటీ (ఏఎంసీ) కార్యదర్శి పి.వెంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో వెంకటలక్ష్మి అవకతవకలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దువ్వూరు మండలంలోని ఓ ప్రైవేట్ వ్యవసాయ గోదాం విషయంలో ఏఎంసీ కార్యదర్శి అవకతవకలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఇన్‌చార్జి మంత్రి సవిత ఆదేశాలతో కలెక్టర్ ఆమెను సెస్పండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్‌ను విచారణకు ఆదేశించినట్టు సమాచారం.


