సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలని పోస్టు కార్డు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలని పోస్టు కార్డు ఉద్యమం

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు

పి. రవీంద్రనాథ్‌రెడ్డి వెల్లడి

కడప కార్పొరేషన్‌: దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించలేమని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్‌ బూసిపాటి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి కడపలో దేశవ్యాప్త పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 2026 మార్చిలో చింతాడ ఆనంద్‌ వర్సెస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఓ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. చర్చి పాస్టర్‌ అయిన చింతాడ ఆనంద్‌ పెట్టిన ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు చెల్లదని తీర్పునివ్వడం బాధాకరమన్నారు. దళితులు చర్చికి పోయినంత మాత్రాన వారి ఆర్థిక స్థితిగతుల్లో మార్పురాదని, సొంత విశ్వాసంతో వారు చర్చికి పోతున్నారన్నారు. చర్చికి పోయే దళితులను బీసీ–సీలుగా గుర్తించడం సరికాదన్నారు. దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి తీర్పే వచ్చినప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అసెంబ్లీలో అదే రకమైన తీర్మానం చేశారన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతుందని దళిత క్రైస్తవులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రం ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్‌ వేయడమో, మరొకటో చేయాల్సి ఉందన్నారు. కానీ కూటమి సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జైనులు, బౌద్దులు, సిక్కులు మతం మారితే వారి కులం మారడం లేదని.. ఒక్క దళితుల విషయంలోనే ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు పోస్టు కార్డు ద్వారా తెలియజెప్పేందుకు కడప నుంచి తొలిసారిగా పోస్టు కార్డు ఉద్యమం చేపట్టామన్నారు. దేశ వ్యాప్తంగా దీనికి మద్దతుగా స్పందన రావాల్సిన అవసరముందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు సీహెచ్‌ వినోద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు త్యాగరాజు, సుబ్బరాయుడు, పార్టీ నాయకులు రాయల్‌ బాబు, డా. పెంచలయ్య, చార్లెస్‌, దానం, కంచుపాటి బాబు, సంపత్‌, రత్న కుమారి, సుశీలమ్మ, తులశమ్మ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement