అట్లూరు : ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి సుశాంత్(13) అనే బాలుడు మృతి చెందిన సంఘటన అట్లూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కమలకూరు గ్రామానికి చెందిన కొర్రపాటి తిరుపాల్, రాధిక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుశాంత్, రెండో కుమారుడు సునీల్ ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇరువురు పిల్లలు గ్రామ సమీపంలో ఉన్న చిన్న చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు. ముందుగా సుశాంత్ చెరువులోకి దిగాడు. మునిగిపోతున్న సుశాంత్‌ను చూసిన సునీల్ గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు తెలిపారు. బంధువులు, స్థానికులు అక్కడికి వెళ్లే సరికి సుశాంత్ మృతి చెందాడు. కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుశాంత్ 7వ తరగతి పూర్తి చేసుకుని 8వ తరగతిలో చేర్పించాలని తల్లిదండ్రులు కలల కన్నారు. ఇంతలోనే ఈత రూపంలో తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


