‘అంతరార్థం’.. ‘పిండి’తార్థం చెబుతాం! | - | Sakshi
Sakshi News home page

‘అంతరార్థం’.. ‘పిండి’తార్థం చెబుతాం!

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో సొసైటీపై విచారణకు ఆదేశం

‘సాక్షి’ సంచలన కథనానికి ఎండోమెంట్‌ అధికారుల స్పందన

క్షేత్రస్థాయికి ఇన్‌స్పెక్టర్లు

గుట్టు రట్టవడంతో సొసైటీ సభ్యుల

ఉలికిపాటు

‘రద్దు చేస్తాం.. రాద్దాంతం వద్దు’ అంటూ బుకాయింపు

తమ మెడకు చుట్టుకుంటుందని

అర్చకుల ఆందోళన

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని చరిత్రాత్మక శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఎండోమెంట్‌ ట్రస్టుబోర్డుకు సమాంతరంగా కొందరు ప్రైవేట్‌ సొసైటీని ఏర్పాటు చేసిన వ్యవహారంపై ఎండోమెంట్‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సాక్షాత్తూ ఆలయ చైర్మన్‌ వంగల నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, అర్చకులు సతీష్‌కుమార్‌, మహేశ్వర శర్మలు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ‘శ్రీ అగస్త్యేశ్వర ప్రగతి సేవాసంఘం’ పేరుతో దొడ్డిదారిన సొసైటీని రిజిస్ట్రేషన్‌ చేయించిన సంగతి తెలిసిందే . ఈ కుట్రలపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ’అంతరార్థం అగస్త్యేశ్వరునికెరుక’ శీర్షికన ఇచ్చిన కథనం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కథనంపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమాలపై ఆరా తీశారు.

అడ్డంగా దొరికిపోయి..

రద్దు చేస్తామంటూ బుకాయింపు!

‘సాక్షి’ దెబ్బకు అక్రమ సొసైటీ సూత్రధారుల్లో ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైంది. ఆలయ నిధులను దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ఈ సొసైటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఎండోమెంట్‌ ఉన్నతాధికారులు సదరు కమిటీని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో అడ్డంగా దొరికిపోయిన కొందరు సొసైటీ సభ్యులు.. ‘దీనిపై చర్చించాల్సింది, చెప్పుకోవాల్సింది ఏముంది.. కావాలంటే సొసైటీని రద్దు చేస్తాం, ఎందుకు దీన్ని ఇంతగా రాద్దాంతం చేస్తున్నారు‘ అంటూ భయంతో అధికారుల ముందే బుకాయించినట్లు సమాచారం. అయితే, ఈ సొసైటీ ఏర్పాటు వ్యవహారం ఎండోమెంట్‌ శాఖలోని కొందరు కిందిస్థాయి అధికారులకు తెలియకుండా జరిగి ఉండదని భక్తులు గట్టిగా ఆరోపిస్తున్నారు.

మా మెడకు చుట్టుకుంటుంది..

కొందరు అర్చకుల ఆవేదన!

ఇదిలా ఉండగా, ఈ అక్రమ సొసైటీ వ్యవహారం ఆలయ అర్చక వర్గాల్లో తీవ్ర ఘర్షణకు దారితీసింది. తమకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా, తమ అంగీకారం తీసుకోకుండా కేవలం చైర్మన్‌, ప్రధాన అర్చకులు బలవంతంగా తమ పేర్లను సొసైటీలోకి లాగారని కొందరు తోటి అర్చకులు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ చట్టాల ఉల్లంఘన కింద ఈ దొంగ సొసైటీ వ్యవహారం ఎక్కడ తమ ఉద్యోగాల మెడకు చుట్టుకుంటుందోనని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విచారణకు ఆదేశించిన అసిస్టెంట్‌ కమిషనర్‌

శివాలయంలో వెలుగుచూసిన ఈ సమాంతర ప్రైవేట్‌ సొసైటీ ఏర్పాటు విషయమై ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కర్‌బాలాజీని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఇన్‌స్పెక్టర్‌కు స్పష్టం చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ సొసైటీ ఏర్పాటు చేసినట్లు వాస్తవమని తేలితే చైర్మన్‌, అర్చకులతో సహా బాధ్యులందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement