వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

వంశీ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

ప్రధాన నిందితుడి కోసం గాలింపు

కడప అర్బన్‌ : తన భార్యతో డ్రైవర్‌ వంశీ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనే అనుమానంతో యజమాని చింతా రామసుబ్బారెడ్డి మరో ముగ్గురితో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను కడప రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ రాజగోపాల్‌

వెల్లడించారు. హత్య సంఘటనకు రెండు రోజులు ముందు ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి సింగపూర్‌ టౌన్‌షిప్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మరో ముగ్గురు నిందితులైన దేవకుమార్‌, నాగార్జున, శ్రీనివాసులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఈ నెల10వ తేదీ కడప రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రామసుబ్బారెడ్డి తన సహచరులతో వంశీని సదరు ఇంటికి పిలిపించుకుని కత్తులతో దారుణంగా హత్య చేశారు. తన భార్య మధురవాణితో కారు డ్రైవర్‌ వంశీ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనే అనుమానం పెనుభూతంగా మారింది. వంశీ, మధురవాణిలు వ్యాపార నిమిత్తం వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు పది రోజులు కానీ, 20 రోజులు అక్కడే ఉండి కలిసి ఉంటున్నట్లు, అలాగే తన పిల్లలు, తన భార్య కూడా రామసుబ్బారెడ్డి మాట వినకుండా, డ్రైవర్‌ వంశీనే మంచోడు అని చెబుతూ కుటుంబ సభ్యులందరూ లెక్క చేయకపోవడంతో అది చూసి ఓర్చుకోలేకపోయాడు. రామసుబ్బారెడ్డి ఎలాగైనా డ్రైవర్‌ వంశీని అడ్డు తొలగించాలనుకున్నాడు. తనకు తెలిసిన బుడ్డాయపల్లెకు చెందిన దేవకుమార్‌, మోడీమీదిపల్లికి చెందిన నాగార్జున, శ్రీనివాసులు సహాయం తీసుకున్నాడు. పక్కా స్కెచ్‌ వేశారు. పథకం ప్రకారం హత్యకు ప్లాన్‌ వేసి అతన్ని సింగపూర్‌ టౌన్‌షిప్‌లోని ఒక ఇంటిలోనికి తీసుకెళ్లి కత్తులతో పొడిచి చంపారు. మృతదేహాన్ని ఒంటిమిట్ట మండలం సాలాబాదు రోడ్డులోని సోమశిల జలాలకు దగ్గరలో గుర్తుతెలియని ప్రదేశంలో కొండ దగ్గర పడేశారు. ఈ హత్య కేసులో దేవకుమార్‌, నాగార్జున, శ్రీనివాసులును అరెస్టు చేసి వారి వద్ద నుంచి, రెండు కత్తులు, మూడు సెల్‌ ఫోన్లు, రెండు రాడ్లు ఒక కారు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు పంపించారు. ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement