ఐటీడీపీ యాప్‌ ద్వారా ఓట్లు తొలగించే కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఐటీడీపీ యాప్‌ ద్వారా ఓట్లు తొలగించే కుట్ర

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

ప్రొద్దుటూరు : ఐ టీడీపీ యాప్‌ ద్వారా వైఎస్సార్‌సీపీ ఓటర్లను గుర్తించి, తొలగించే కుట్ర జరుగుతోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రారంభమై ఒక్క రోజు మాత్రమే అయిందని, ఆ ఒక్క రోజులోనే టీడీపీ లీలలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ విషయంపై మంగళవారం ఆయన ఏఈఆర్‌ఓ, తహసీల్దార్‌ ఉదయకుమార్‌ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైందని, మన ఓటును మనమే సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓటర్లు గతంలో పాలకులను నిర్ణయించేవారని, ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయించి ఎవరి ఓటు ఉండాలి.. ఎవరి ఓటు వద్దు.. అనేది నిర్ణయిస్తున్నారని చెప్పారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 800 నుంచి 1,100 ఓట్లు ఉన్నాయని, ఐటీడీపీ యాప్‌ ద్వారా టీడీపీ బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌ వైఎస్సార్‌సీపీ ఓటర్లను గుర్తించి, ఫాం 7 ద్వారా తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. అమృతానగర్‌లో బూత్‌ లెవెల్‌ అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే చేయకుండా, కార్యాలయాల్లో కూర్చొని ఓటర్లను పిలిపించుకోవడం సరికాదన్నారు. శంకరాపురంలో బీఎల్‌ఓ.. టీడీపీ వారు ఉన్న వీధుల్లోకి రావద్దని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలకు చెప్పడం సరికాదన్నారు. కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఈవీఎంల ద్వారా తాము ఓటమి పాలయ్యామని, సర్‌ ద్వారా వచ్చే ఎన్నికల్లో మోసపూరితంగా మళ్లీ తమను ఓడించేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. అర్హులైన ఓటర్లను తొలగించిన అధికారులకు ఉరి శిక్ష వేసినా తప్పు కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. సర్‌ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతోపాటు ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఒక్క రోజులోనే వెలుగులోకి టీడీపీ లీలలు

ఇళ్ల వద్దకు వెళ్లకుండా ఒకచోట కూర్చొని సర్వే చేయడం సరికాదు

అర్హులైన ఓటర్లను తొలగించిన వారికి ఉరి శిక్ష వేసినా తప్పులేదు

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపాటు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement