మైదుకూరు : తన తల్లిని దూషించినందుకు మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గాలి సుదర్శన్‌రెడ్డి.. అదే కాలనీకి చెందిన సంపంగి నాగేంద్ర అలియాస్ నాగేంద్రబాబు అలియాస్ పెద్ద షకీలా అనే యువకుడిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంపంగి నాగేంద్ర అదే కాలనీకి చెందిన సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యంగా అతని తల్లిని పదే పదే అవమానకరంగా దూషిస్తూ అసభ్య పదజాలంతో వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన సుదర్శన్‌రెడ్డి నాగేంద్రను హత్య చేయాలని మనసులో పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఈనెల 7న తెల్లవారుజామున కాలనీలోని ఆలయం ముందున్న అరుగుపై నిద్రిస్తున్న నాగేంద్రపై మచ్చు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మృతుడి సోదరుడు నాగేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అర్బన్ సీఐ కె.రమణారెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సుదర్శన్‌రెడ్డి కోసం గాలింపు చేపట్టారు. శనివారం మైదుకూరు – పోరుమామిళ్ల రహదారిలోని ఎర్ర చెరువు సమీపంలో సుదర్శన్‌రెడ్డిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించాడని, అతడు చూపించిన ప్రదేశం నుంచి హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. నిందితున్ని కోర్టుకు హాజరు పరుస్తున్నట్టు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్‌ఐలు కె.చిరంజీవి, కె.వెంకటరమణ, ఏఎస్‌ఐ శివప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ శివభాస్కర్‌రెడ్డి, కానిస్టేబుల్ నవీన్‌కుమార్, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్


