కడపలో యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

కడపలో యువకుడి దారుణ హత్య

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

కడప అర్బన్‌ : కడప నగరం రిమ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఒంటిమిట్ట మండల పరిధిలో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ సంఘటనపై కడప రిమ్స్‌ పీఎస్‌ సీఐ రాజగోపాల్‌, మృతుడి తండ్రి మునెయ్య, బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వేకోడూరు మండలానికి చెందిన చింతా రామసుబ్బారెడ్డి గత 15 సంవత్సరాలుగా కువైట్‌కి జీవనాధారం కోసం వెళ్లి ఇండియాకు అప్పుడప్పుడు వస్తుంటాడు. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల కిందట రామ సుబ్బారెడ్డి, తన భార్య మధురవాణి, కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి కడపలో రిమ్స్‌కు వెళ్లే దారిలో ఉన్న విన్యాస అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. అప్పటి నుంచి చిట్వేలి మండలం సిద్ధారెడ్డిపల్లెకు చెందిన అక్కుపల్లి మునెయ్య కుమారుడు వంశీ(25).. రామసుబ్బారెడ్డి వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రామ సుబ్బారెడ్డి గత ఏడాది నుంచి కడపలోనే ఉంటున్నాడు. రామ సుబ్బారెడ్డి సతీమణి మధురవాణి కడపకు వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తూ, కువైట్‌ ఇతర దేశాలకు వస్తు సామగ్రిని ఎగుమతి, దిగుమతి చేస్తుండేది. ఈ క్రమంలో మధురవాణి, డ్రైవర్‌ వంశీతో సన్నిహితంగా ఉండేదని రామసుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన రామసుబ్బారెడ్డి తమ డ్రైవర్‌ వంశీని తనతో పాటు వాహనంలో బయటికి తీసుకెళ్లాడు. తర్వాత ఇంటికి రాలేదు. ఈ నెల 11వ తేదీన వంశీ తండ్రి మునయ్య తన కుమారుడికి ఫోన్‌ చేసినా స్పందించలేదు. వంశీ యజమాని రామసుబ్బారెడ్డికి ఫోన్‌ చేసినా ప్రయోజనం లేకపోవడంతో కడప రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీతోపాటు రామసుబ్బారెడ్డి ఇంటికి రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటిమిట్ట మండలం సాలాబాద్‌ సమీపంలో రాచపల్లి పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడి శవం కనిపిస్తే స్థానిక ప్రజలు అక్కడి కానిస్టేబుల్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఈనెల 11వ తేదీ రాత్రి అక్కుపల్లి వంశీ కనిపించడం లేదని రిమ్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. మునెయ్యను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి యువకుడి మృతదేహాన్ని పరిశీలింప చేయగా తన కుమారుడు వంశీ మృతదేహమే అని గుర్తించాడు. ప్రాథమికంగా ఇది హత్యగా గుర్తించారు. కడప రిమ్స్‌ వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తండ్రికి అప్పగించారు. మృతదేహంపై దెబ్బలు ఉన్నట్లుగా గుర్తించారు. తన కుమారుడి మరణానికి అతని యజమాని రామసుబ్బారెడ్డి కారణమని పోలీసులకు మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సంఘటనపై రిమ్స్‌ సీఎస్‌ సీఐ రాజగోపాల్‌, ఇన్‌చార్జి ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి తమ సిబ్బందితో కలిసి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement