సమస్యలే తొలి పాఠం | - | Sakshi
Sakshi News home page

సమస్యలే తొలి పాఠం

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

కడప ఎడ్యుకేషన్‌ : వేసవి సెలవులు పూర్తి కావడంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడంతో ప్రభుత్వ యజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో అసౌకర్యాలు స్వాగతం పలికాయి. ‘బడి తెరిచిన రోజే పిల్లలందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు అందజేస్తాం. అదే రోజు తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలకు జమ చేస్తాం’ అని చెప్పిన మాటలన్నీ నీటి మీద బుడగలనేని మరోమారు కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో బడి తెరిచిన రోజే అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక పంపిణీ చేసి ప్రభుత్వ బడుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉండేది. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా విద్యార్థులు పాత యూనిఫాం, పాత బ్యాగులు, పాత చెప్పులతో పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలకు విద్యాకానుక కిట్లు ఇచ్చినా.. అందులో అన్ని వస్తువులు అందలేదు. బ్యాగు, బెల్ట్‌, షూ, సాక్సులతోపాటు 6వ తరగతి విద్యార్థులకు డిక్షనరీలు అసలు పాఠశాలకే రాలేదు. దీంతోపాటు కొన్ని పాఠశాలల్లో నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు కూడా కొంతమంది విద్యార్థులకు అందలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు నిరాశ చెందారు. ఇక తల్లికి వందనం విషయానికి వస్తే పాఠశాలలు తెరిచిన రోజే తల్లుల ఖాతాలకు నగదు జమ చేస్తామని చెప్పారు. అది కూడా ఎంత మంది పిల్లలను బడికి పంపితే.. అందరికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాకు నగదు జమ చేస్తామన్నారు. తీరా బడి తెరిచే నాటికి జూలై మొదటి వారంలో జమ చేస్తామని చెప్సి తుస్సుమనిపించారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మొదటి రోజే పిల్లలు నిరాశ నిస్పృహలకు గురి కావాల్సి వచ్చింది.

మొదటి రోజు...

జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథకోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి 3145 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 324371 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 277980 మంది విద్యార్థులు హాజరై 85.5 శాతం హాజరు నమోదైంది. మొదటి రోజు అంతంత మాత్రంగానే విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం తర్వాత మరుసటి రెండు రోజులు సెలవులు కావడంతో విద్యార్థులు పెద్దగా రాలేదు. దీంతో పాఠశాలల్లో పండగ వాతావరణం కన్పించలేదు.

పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు

అరకొరగా విద్యామిత్ర కిట్లు

తొలిరోజు అంతంత మాత్రమే హాజరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement