బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి

కడప సెవెన్‌రోడ్స్‌ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ ధోని శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడపలో పర్యటించిన ఆయన జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడపను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కార్మిక, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మెకానిక్‌ షాపులు, హోటళ్లు, గ్యారేజీలు, గనులు, సిమెంట్‌ పరిశ్రమల్లో బాల కార్మికుల నియామకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అంతకుముందు స్థానిక మున్సిపల్‌ హైస్కూల్‌లోని స్మార్ట్‌ కిచెన్‌ను సందర్శించిన శ్రీనివాసమూర్తి, వంట సిబ్బంది తప్పనిసరిగా చేతి తొడుగులు, తల టోపీలు, ఏప్రాన్‌లు ధరించాలని సూచించారు. స్థానిక రామాంజనేయపురంలోని రెవెన్యూ సేవా సమితి నిర్వహిస్తున్న అమ్మఒడి ఆశ్రమాన్ని సందర్శించిన డా.శ్రీనివాసమూర్తి, అక్కడి బాలలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కడప సెంట్రల్‌ జైలు, మహిళా జైలును సందర్శించిన ఆయన, రిమాండ్‌ ఖైదీలలో 18 సంవత్సరాల లోపు బాలలు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పరిశీలించారు. సాయంత్రం సీకే దిన్నె మండలంలోని బుగ్గలపల్లి దళితవాడను సందర్శించి, అంగన్‌వాడీ కేంద్రంలో సేవలు పొందుతున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రమాదేవి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసులు, పోలీసు శాఖ అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బాలబాలికలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement