● జోన్ 4 నుంచి జోన్–5లోకి కడప ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ
● తగ్గనున్న ఉద్యోగుల సంఖ్య..
పని భారం
● మారనున్న వైద్య ఆరోగ్యశాఖ
పరిపాలన స్వరూపం
కడప రూరల్ : వైద్య ఆరోగ్యశాఖ జోన్ విభాగంలో మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం కడప కేంద్రంగా ఉన్న జోన్ –4 ప్రాంతీయ కార్యాలయం కడప పాత రిమ్స్‌లో కొనసాగుతోంది. ఈ శాఖ పరిధిలోకి వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి సత్యసాయి మొత్తం 8 జిల్లాలు వస్తాయి. దాదాపు 17 కేడర్‌లు, మొత్తం 11 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగుల పదోన్నతులు, సర్వీస్ కు సంబంధించిన అంశాలతో పాటు ఉద్యోగ నియామకాల అంశాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. తాజాగా జోన్ లను విభజించడంతో ఆ శాఖ పరిధి తగ్గడంతో పాటు ఉద్యోగుల సంఖ్య.. పరిపాలనాపరమైన అంశాలు గ ణనీయంగా తగ్గనున్నాయి. ఉదాహరణకు కడప కేంద్రంగా ఉన్న జోన్–4 కార్యాలయం పరిధిలోకి ప్రస్తుతం 8 జిల్లాలు ఉండగా, ఇకపై జోన్–5 గా మారడంతో ఈ శాఖ పరిధిలోకి వైయస్సార్ కడప తో పాటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు మాత్రమే రానున్నాయి.
మొత్తం 6 జోన్‌లు, 2 మల్టీ జోన్‌లు..
ఇప్పటివరకు రాష్ట్రంలో 4 జోన్‌లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా విశాఖపట్నం జోన్–1, రాజమండ్రి జోన్ –2, గుంటూరు జోన్–3, వైయస్సార్ కడప జోన్ –4 గా ఉన్నాయి. తాజాగా జోన్ ల విభజనకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ ను, రాష్ట్ర ప్రభుత్వం జీఓ ను జారీ చేసింది. ఆ ప్రకారం 2 మల్టీ జోన్ లు, ఆరు జోన్ లు ఏర్పాటు కానున్నాయి. ఒక మల్టీ జోన్ పరిధిలోకి మూడు జోన్‌ల చొప్పున ఉంటాయి. ఆ ప్రకారం మల్టీ జోన్ –1 పరిధిలో జోన్–1 గా విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలు, జోన్ –2గా అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, జోన్–3గా వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కష్ణాజిల్లాలు ఉంటాయి. మల్టీ జోన్–2 లో జోన్–4 గా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–5గా వైయస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, జోన్–6గా కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు కొనసాగనున్నాయి.
జోన్ కేంద్రాల కొనసాగింపుపై సందిగ్ధం..
ఇప్పటివరకు కడప, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు కేంద్రాలుగా ప్రాంతీయ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. విభజన కారణంగా అదనంగా మరో రెండు కొత్తగా రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పనిచేస్తున్న ప్రాంతీయ కార్యాలయాలు అదే కేంద్రంలో పనిచేస్తాయా.. లేక మరొక చోటికి తరలిస్తారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు కానున్న రెండు ప్రాంతీయ కార్యాలయాలు ఆ జోన్ లకు సంబంధించి ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తారు అనే చర్చ ఆ శాఖ ఉద్యోగుల్లో జోరుగా కొనసాగుతోంది
మార్పు వచ్చేనా...?
జోన్‌ల పెంపు.. జోన్‌ల పరిధిలోకి వచ్చే జిల్లాల కుదింపుతో ఆ శాఖ కార్యాలయం పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. అలాగే నియామకాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. కాగా కొత్త జోన్‌ల ఏర్పాటుతో ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు స్థానభ్రంశం కలగనుంది. అంటే అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించి మరొకచోటికి పంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు ఇక్కడ మేము పనిచేయలేమంటూనే, ఉన్న సీట్లోనే పాతుకు పోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొంతమంది మరో ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ కార్యాలయం‘ఖజానాకు నిలయం’గా భావించడంతో కొంతమంది ఉద్యోగులు అక్కడ సీటు సంపాదించడానికి పాకులాడుతున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఇక్కడ కొంతమంది ఉద్యోగ నేతల మధ్యవర్తిత్వం.. పెత్తనం పెద్దగానే సాగుతోందనే విమర్శలు ఉన్నాయి.


