కడప సిటి: జిల్లాలో ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు త్వరలోనే వారి ఎన్‌పీసీఐ ద్వారా లింకై న ఖాతాలకు జమ అవుతాయని డ్వామా పీడి ఆదిశేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2025 డిసెంబర్ 12 నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు అందనున్నాయిని తెలిపారు. వైఎస్సార్ కడపజిల్లాకు రూ. 22.36 కోట్లు చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు.
కడప సెవెన్ రోడ్స్: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
జిల్లాలో ఆరుగురు సీఐల బదిలీ
కడప: వైఎస్సార్ కడప జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. వి.ఆర్. అనంతపురం రేంజ్‌లో పని చేస్తున్న వి. శ్రీహరిని పులివెందుల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. అలాగే పులివెందుల ట్రాఫిక్ పీఎస్‌లో ఉన్న పి. రామాంజులును కర్నూల్ మహిళాపీఎస్‌కు, కడప రిమ్స్ యూపీఎస్ (అప్‌గ్రేడ్ స్టేషన్)లో పని చేస్తున్న బి.రామకృష్ణారెడ్డిని చిన్నచౌక్ యూపీఎస్‌కు బదిలీ చేశారు. ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎం రాజగోపాల్‌ను రిమ్స్ యూపీఎస్‌కు, కడప ట్రాఫిక్ యూపీఎస్ సీఐఎ. సరేష్ రెడ్డిని ప్రొద్దుటూరు ట్రాఫిక్ యూపీఎస్‌కు , వీఆర్‌లో ఉన్న ఎం. తులసీరామ్‌కు కడప ట్రాఫిక్ యూపీఎస్‌కు బదిలీచేశారు.
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ మంగళవారం నిర్మానుష్యంగా మారింది. ఎండలు విపరీతం కావడంతోపాటు కొండపై అధిక వేడి ఉండటం, చల్లదనం లేకపోవడంతో సందర్శకులు ఏసీ గదులను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. దాంతోపాటు మైదాన ప్రాంతాల్లో ఉంటున్న ఎండలే కొండపైనా ఉండటంతో అక్కడికి వెళ్లినా అంతే అన్న భావనతో సందర్శకుల రాక తగ్గిపోయింది. ఫలితంగా కొండపై గదులు ఖాళీగా ఉండగా, సాధారణ సందర్శకులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొండపై పర్యాటకుల సంచారం లేక బోసిపోతోంది. మంగళవారం కూడా కొండపై 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం ఆరు గంటలకు కాస్త తగ్గిన ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది.
రాయచోటి: రాయచోటి పట్టణం ఠానా సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ సమయంలో రాజంపేట వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొంది. మంగళవారం ఉదయం పట్టణంలో రద్దీగా ఉన్న ఠానా వద్ద చేటుచేసుకున్న ఈ సంఘటన.. అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి డిపోకి వెళ్తున్న బస్సు ఠానా సర్కిల్ నుంచి సుండుపల్లి రోడ్డు వైపు తిరగగానే బ్రేక్ ఫెయిల్ అయినట్లు డ్రైవర్ గమనించి కేకలు వేశారు. నిత్యం రద్దీగా ఉండే సర్కిల్‌లో డ్రైవర్ అరుపులు విని పక్కకు పరుగులు తీశారు. కానీ ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
రొంపిచెర్ల: రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూనియర్ అసిస్టెంట్ జయరాం నిద్రపోతూ కనిపించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చిన రైతులు తమ కెమెరాల్లో బంధించారు. వేలాది రూపాయలు జీతం తీసుకుంటూ ఆఫీస్‌లో నిద్ర పోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పులిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌కు సరెండర్ చేశారు. దీంతో కలెక్టర్ రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయానికి మూడు నెలల క్రితం డిప్యూటేషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ తహసీల్దార్ కిరణ్ కుమార్ వివరణ కోరడానికి ప్రయత్నించగా.. ఆయన రెండు రోజులుగా సెలవులో ఉన్నట్లు తెలిసింది.


