ఖాకీలు.. కథలు అల్లుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

ఖాకీలు.. కథలు అల్లుతున్నారు!

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

ఖాకీలు.. కథలు అల్లుతున్నారు! ● రాజ్‌కుమార్‌పై థర్డ్‌ డిగ్రీ..

సాక్షి ప్రతినిధి, కడప: ఓ జాతరలో యువకుల మధ్య తలెత్తిన గొడవ చినికిచినికి గాలివానగా మారింది.. పెద్ద దస్తగిరి అనే వ్యక్తి హత్య వరకూ వెళ్లింది. నిజానికి ‘గొడవ’ సమయంలోనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటనే జరిగేది కాదు.. ఒక నిండు ప్రాణం పోయేదికాదు.. ఖాకీల నిర్లక్ష్యం వల్లే ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఘర్షణ సమయంలో పూర్తిగా అలసత్వం వహించిన పోలీసులు హత్య కేసు దర్యాప్తుకొచ్చేసరికి కూటమి నేతల కుట్రలో పావుగా మారారు. హత్యకు రాజకీయ రంగు పులిమి..స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కూటమి నేతలు వేసిన స్కెచ్‌లో భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డిని ఇరికించే యత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నిందితులతో అనుకూలంగా వాంగ్మూలాలు తీసుకుని...నిత్యానందరెడ్డే హత్య చేయించినట్లు కథలు అల్లుతున్నారు.

● ఈ నెల 6వ తేదీన రిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో జరిగిన దాడిలో ఆలంఖాన్‌పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ హత్యను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు పెద్ద స్కెచ్‌ వేశారు. చనిపోయిన పెద్ద దస్తగిరి, నిత్యానందరెడ్డి ఇద్దరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తారనే ఒకే ఒక తీగను పట్టుకుని నిత్యానందరెడ్డే హత్య చేయించాడనే స్థాయికి కేసును మళ్లించేశారు.

నిందితుల్ని చితకబాది...

తొలుత కేసు జాతరలో చోటుచేసుకున్న వివాదంపైనే విచారణ సాగింది. ఆపై రాజకీయ రంగు పులుముకొని ఇన్‌ఛార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అంతే వేగంగా వైఎస్సార్‌సీపీ టార్గెట్‌గా అడుగులు పడ్డాయి. నిందితులను కడప డీటీసీలో చితకబాది నిత్యానందరెడ్డి పేరు చెప్పించుకుని...కేసును వైఎస్సార్సీపీ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారని నిత్యానందరెడ్డి భార్య బండి దీప్తి ఆరోపిస్తున్నారు. విచారణ జరుపుతున్న అధికారులు మార్చడంలోనే అనుమానాలుంటే...తమకు గతంలో వివాదాలున్న ఓ డీఎస్పీ చేతికి కేసు విచారణ ఇవ్వడంలో పెద్ద కుట్ర దాగుందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు...

ఆలంఖాన్‌పల్లెలో దాడి వ్యవహారం పోలీసులకు చేరవేస్తే తక్షణమే స్పందించాల్సింది పోయి, రిమ్స్‌లో అడ్మిట్‌ కావాలని ఉచిత సలహా ఇచ్చారు. అటువైపు కన్నెత్తి చూడలేదు. రిమ్స్‌ వరకూ భద్రత కల్పించాలని కోరినా నిష్ప్రయోజనమే అయ్యింది. ఈమొత్తం వ్యవహారం పోలీసుశాఖను చుట్టుముట్టింది. దాంతో తక్షణమే నగర డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలుకా సీఐ రెడ్డెప్పను బదిలీ కూడా చేశారు. పోలీసుల వైఫల్యం తేటతెల్లం కావడంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు హత్య కేసును అనేక మలుపులు తిప్పుతున్నారు.

పోలీసులు అనుకున్న చట్రం చుట్టూ హత్యకేసు దర్యాప్తు

నిత్యానందరెడ్డి సహాయకుడు రాజ్‌కుమార్‌పై థర్డ్‌ డిగ్రీ

రూ.5లక్షలు నగదు నరేంద్ర చేరవేశానని ఒప్పుకోవాలంటూ కోటింగ్‌

పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు దర్యాప్తులో అనేక మలుపులు

సెర్చ్‌ వారెంట్‌ తీసుకొని నిత్యానందరెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి సోదాలు చేసిన పోలీసు అధికారులు నిత్యానందరెడ్డి సహాయకుడు రాజ్‌కుమార్‌పై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్లు సమాచారం. నిత్యానందరెడ్డి రూ.5లక్షలు నగదు ఇస్తే ఆ మొత్తం కేసులో ఉన్న నరేంద్రకు అప్పగించానని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తూ రింగ్‌ రోడ్డులోకి తీసుకొని కోటింగ్‌ ఇచ్చారు. కేవలం ఇంటి పనులు, వ్యక్తిగత పనులకే పరిమితమైన తనకు ఇవేవి తెలియవన్నందుకు ఖాకీలు కర్రలతో దాడులు చేశారు. ఇదే విషయాన్ని రాజ్‌కుమార్‌ సైతం వాపోతున్నారు. దీనిని బట్టే పోలీసుల విచారణ ఎలాంటి దిశలో పయనిస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement