పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

వల్లూరు: పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వాముల కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా జరిగాయి. క్షేత్రాధిపతియైన పరమ శివుని అంశలోని వైద్యనాఽథ స్వామి కల్యాణంతోపాటు క్షేత్ర పాలకుడైన విష్ణు అంశలోని చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవం ఒకే రోజు జరగడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఉదయం శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై శ్రీ కామాక్షీ వైద్యనాథుల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి కొండపై చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోని మంటపంలో ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్‌ దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవిలతో శ్రీ చెన్నకేశవుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాలను కనులారా చూసి తరించారు. అనంతరం శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామికి, శ్రీ చెన్నకేశవ స్వామికి గజవాహన సేవను నిర్వహించారు.

గరుడ వాహనంపై చెన్నకేశవుడు

కాగా మంగళవారం తెల్లవారుజామున శ్రీచెన్నకేశవస్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గ్రామ మాడ వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి రథోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 4. 30 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల రథోత్సవం జరుగుతుంది.

వైద్యనాఽథుని కల్యాణ మహోత్సవంలో మంగళసూత్రాన్ని చూపుతున్న పురోహితులు శ్రీ చెన్నకేశస్వామి కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న వేద పండితులు

Advertisement
 
Advertisement
Advertisement