కడప వైఎస్‌ఆర్ సర్కిల్: శాప్ లీగ్ ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో ఫుట్‌బాల్, బాక్సింగ్ జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ గౌస్‌బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
● ఈనెల 23న పుట్‌బాల్ విభాగంలో సబ్ జూనియర్ అండర్–15, అండర్–20 విభాగంలోని క్రీడాకారులకు నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నా రు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.
● ఈ నెల 24న సబ్ జూనియర్ అండర్–15, జూనియర్స్ అండర్–19 బాల బాలికలకు నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
మే 2 నుంచి అన్నమయ్య జయంతి ఉత్సవాలు
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 616 జయంతి ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో మే 2 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు తాళ్లపాక టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ సోమవారం తెలిపారు. 8వతేది వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. 2న తాళ్లపాకలోని ధ్యానమందిరంలో గోష్ఠిగానం, సప్తగిరి సంకీర్తనలు, 10గంటలకు శ్రీవారి కళ్యాణం ఉంటుందన్నారు. అలాగే అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద సాయంత్రం ఊంజలసేవ నిర్వహిస్తారన్నారు. 3 నుంచి 8వతేది వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
కడప సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా హాజివలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా హాజివలి సోమవారం బాధ్యత లు స్వీకరించారు. నంద్యాల డీటీసీ నుంచి కడపకు బదిలీపై వచ్చారు. ఈయన గతంలో పులివెందుల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా, లింగాల ఎస్‌ఐగా, పులివెందుల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐగా పనిచేశారు. పోలీసు శాఖలో విస్తృత అనుభవం కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కడపలో నేరం నియంత్రణపై దృష్టి పెట్టనున్నట్లు హాజివలి తెలిపారు.
ఏసీబీ సోదాలు
రాయచోటి : రాయచోటిలో సోమవారం ఏసీబీ అధికారులు బీసీ సంక్షేమ సహాయ అధికారి బాలాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో బీసీ సంక్షేమ సహాయ అధికారిగా బాలాజీ పనిచేస్తున్నారు. రెండు నెలల కిందట విధి నిర్వహణలో ఉంటూ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పట్లోనే కదిరితో పాటు రాయచోటిలోని ఆయన స్వగృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు సోమవారం తిరిగి సోదాలు చేసినట్లు తెలిసింది. ఈ సోదాలలో పలు భూమి రికార్డులు, బంగారు నగలు, డబ్బులు భారీగా పట్టుబడినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఆయన ఇంటితోపాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.
ఘనంగా చాంద్ ఫిరా గుంబద్ దర్గా నషాన్
కడప ఎడ్యుకేషన్: కడప నగరం రహమతుల్లా వీధిలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన చాంద్ ఫిరా గుంబద్ దర్గా నషాన్ ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లి అమిరురన్నిసా ఇంటి నుండి గంధం కళాశాన్ని తీసుకువచ్చి దర్గాలో గంధాన్ని సమర్పించారు. అలాగే దర్గా ఆవరణంలో ఉన్న జెండా ను అలంకరించి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వచ్చే నెల మే 3వ తేదీ గంధం, 4వ తేదీ ఉరుసు, 5వ తేదీ తహలీల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దర్గా ముతవల్లి అమిరున్నిసా తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్ బాష, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు అమీర్ బాబు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


