మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడం బాధాకరం | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడం బాధాకరం

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

పులివెందుల : లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల లోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారకతకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలోనే వైఎస్‌ జగనన్న శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలులో ఉండేదని, ఆ తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో దానిని అమలు చేయలేదన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థలలో ఏకంగా 54శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కొత్త అర్థం తీసుకొచ్చారన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొంది ఉంటే మహిళలు విధాన నిర్ణయాలలో భాగస్వామ్యులై ఉండేవారన్నారు. వైఎస్‌ జగనన్న చెప్పినట్లుగా 50శాతం సీట్ల పెంపుదలే ఉత్తమమైన విధానమని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ అవినీతిని, లోపాలను ప్రశ్నించిన వారిపై ఏకంగా దేశ ద్రోహం కేసులు పెట్టి రాక్షస పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు వీరు చేసే అరాచకాన్ని చూస్తున్నారని బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరం లేదన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement