రాజంపేట : మండలంలోని పులపత్తూరు గ్రామంలో రజకుడు దంపెట్ల మల్లికార్జున హత్య కేసులో గోబుగారి సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతకక్షల కారణంగా పథకం ప్రకారం ఇంట్లో ఎవరు లేని సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేశారన్నారు. పరారీలో ఉన్న సుబ్బారెడ్డిని నారమరాజుపల్లె నవోదయ కాలనీ వద్ద అరెస్టు చేశామన్నారు. రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో మన్నూరు సీఐ లింగప్ప, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గంజాయి కేసులో ఇద్దరు అరెస్ట్
వేంపల్లె : వేంపల్లెలో గంజాయి సేవించడంతోపాటు విక్రయాలు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఎస్‌ఐలు తిరుపాల్ నాయక్, తాయార్ హుస్సేన్‌లతో కలిసి పులివెందుల – రాయచోటి బైపాస్ రోడ్డులోని గవి మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే క్రాస్ రోడ్డు వద్ద వేంపల్లెలోని శ్రీరాంనగర్‌కు చెందిన నల్లబల్ల మల్లికార్జున, యల్లంకూరు వెంకటేష్‌లు గంజాయి సేవించడంతోపాటు విక్రయాలు చేస్తుండడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసింహులు చెప్పారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
మైదుకూరు : మండలంలోని వనిపెంట వద్ద సోమవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొని వనిపెంట సిద్ధమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్త సీతారామాపురం గ్రామానికి చెందిన వీరారెడ్డి, సిద్ధమ్మ దంపతులు మైదుకూరుకు వ్యక్తిగత పనిపై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్లేందుకు బ్రహ్మంగారిమఠం వెళ్లే బస్సు ఎక్కి వనిపెంటలో దిగారు. భర్త వీరారెడ్డి రోడ్డు దాటి వెళ్లగా సిద్ధమ్మ కూడా భర్తను అనుసరిస్తూ రోడ్డు దాటుతుండగా మైదుకూరు వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.


