కూటమి ప్రభుత్వం క్రీడాకారులతో ఆటలాడుకుంటోంది. ఆటల్లో రాణించి బంగరు భవితకు బాటలు వేసుకుందామనే యువత ఆశలను ఆదిలోనే నీరుగారుస్తోంది. గత ప్రభుత్వంపై అక్కసుతో జాతీయ క్రీడ హాకీకి ఆటంకాలు కలిగిస్తోంది . జిల్లా కేంద్రమైన కడప నగరంలోని మున్సిపల్‌ స్టేడియంలో మూత వేసి | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం క్రీడాకారులతో ఆటలాడుకుంటోంది. ఆటల్లో రాణించి బంగరు భవితకు బాటలు వేసుకుందామనే యువత ఆశలను ఆదిలోనే నీరుగారుస్తోంది. గత ప్రభుత్వంపై అక్కసుతో జాతీయ క్రీడ హాకీకి ఆటంకాలు కలిగిస్తోంది . జిల్లా కేంద్రమైన కడప నగరంలోని మున్సిపల్‌ స్టేడియంలో మూత వేసి

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

క్రీడలకు పట్టం కట్టిన వైఎస్సార్‌

వాకర్స్‌ మధ్యలో హాకీ ఆడుతున్న క్రీడాకారులు

కడప వైఎస్సార్‌ సర్కిల్‌: జాతీయ క్రీడ హాకీపై కడప క్రీడాకారులకు ఆసక్తి ఎక్కువ. గతంలోనూ ఇక్కడి నుంచి పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు. నేటితర ఆటగాళ్లు కూడా హాకీలో రాణించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇక్కడి క్రీడాకారుల ఆసక్తిని గమనించి.. వారిని మరింత ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో మున్సిపల్‌ స్టేడియంలో ఆస్ట్రనాట్‌ టర్ఫ్‌ పిచ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

సహకరించిన ఎంపీ,

మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మేయర్‌

కడప స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి బయటికొచ్చిన ఆటగాళ్లు క్రీడల్లో మరింత రాటుదేలాలనే కసితో మున్సిపల్‌ స్టేడియంలో రోజు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేక డీలాపడుతున్నారు. ముఖ్యంగా హాకీని ఎంచుకున్న ఆటగాళ్లు ఎర్రమట్టి పిచ్‌పైనే సాధన చేస్తూ.. జాతీయస్థాయిలో టర్ఫ్‌ పిచ్‌పై ఆడడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో అప్పటి డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, మేయర్‌ సురేష్‌ బాబు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ అవినాష్‌రెడ్డి సహకారం కూడా తోడైంది. స్పందించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం టర్ఫ్‌ కోర్టు నిర్మాణానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. సీమ బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే సదాశయంతో ఒలింపిక్‌ స్థాయి ప్రమాణాలతో టర్ఫ్‌ పిచ్‌ను అత్యున్నతంగా తీర్చిదిద్దింది. రూ.8కోట్లతో 2023లో ప్రారంభించిన ఈ నిర్మాణ పనులు 2024ప్రారంభంలో పూర్తయ్యాయి. ఆపై ఎన్నికల కోడ్‌ రావడం.. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ప్రారంభానికి ఆమడదూరంలో ఉండిపోయింది.

మట్టిలో ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

డీఎస్‌ఏ క్రీడా మైదానంలో మట్టిలో హాకీ ప్రాక్టీస్‌ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా క్రీడాకారుల సంక్షేమం కోసం ఆస్ట్రానాట్‌ టర్ఫ్‌ పిచ్‌ కావాలని గత వైఎస్‌ఆర్‌ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్రీడాకారులందరం అడిగిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా కడపలో ఈ పిచ్‌ నిర్మాణానికి సహకరించారు. పూర్తయి మూడేళ్లయినా ప్రారంభం కాలేదు. మైదా నం బయట ఆడుతుంటే వాకర్స్‌ మమ్మల్ని తిడుతూ గొడవలకు దిగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆస్ట్రానాట్‌ టర్ఫ్‌ పిచ్‌ను ప్రారంభించాలి. –ప్రదీప్‌, హాకీ స్టేట్‌ ప్లేయర్‌

వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహానేత వైఎస్‌ఆర్‌ కడపలో స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్మించారు. అందులో చేరినవారు ఇప్పటికే పతకాల పంట పండించారు. ఎంతోమంది జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే రంజీ మ్యాచులు జరిగే విధంగా ఏసీఏ –వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. మహానేత వైఎస్సార్‌ ఎంతో ముందు చూపుతో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే నేటి కూటమి ప్రభుత్వం క్రీడలపై చిన్నచూపు చూస్తోంది.

హాకీ టర్ఫ్‌ కోర్టును పూర్తి చేసినగత వైఎస్సార్‌ సీపీ సర్కారు

రెండేళ్లుగా తాళం వేసిన కూటమి సర్కారు

ప్రాక్టీస్‌ కోసం తీవ్ర ఇబ్బందులుపడుతున్న క్రీడాకారులు

మూడేళ్లయినా ప్రారంభం కాలేదు

టర్ఫ్‌ పిచ్‌ పూర్తయి దాదాపు మూడేళ్లయినా ఇంతవరకు ప్రారంభం కాలేదు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా క్రీడాకారుల భవిష్యత్‌ కోసం ఈ పిచ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హాకీని మట్టిపై ఆడటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రౌండ్‌లో ఆడుతుంటే వాకర్స్‌కు మాకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. జిల్లా నుంచి ఇంటర్నేషనల్‌ హాకీ టీం ఆడాలంటే ఈ పిచ్‌లు ఎంతో అవసరం. దీనిని ప్రారంభించాలని పలుమార్లు కలెక్టర్‌, కమిషనర్‌, డీఎస్‌డీవోకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.

–జితేష్‌, క్రీడాకారుడు.కడప

కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కడపతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఎర్రమట్టిపై హాకీ ప్రాక్టిస్‌ చేసి ఇంటర్నేషన్‌లో ఆస్ట్రానాట్‌ టర్ఫ్‌ పిచ్‌పై ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కడప డీఎస్‌ఏ క్రీడా మైదానంలో దాదాపు రూ.8. కోట్లతో టర్ఫ్‌ పిచ్‌ నిర్మించింది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, మాజీ మేయర్‌ సురేష్‌బాబు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చొరవ చూపారు. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్షతతో ప్రారంభించకపోవడం బాధాకరం.

–దేవిరెడ్డి ఆదిత్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం

Advertisement
 
Advertisement
Advertisement