మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి | - | Sakshi
Sakshi News home page

మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

ఒంటిమిట్ట: చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు తీవ్రమయ్యాయి. వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్టలోని హరిజన వాడకు చెందిన ఈరి హర్షవర్ధన్‌ అలియాస్‌ నాని (23) అనే దళిత యువకునిపై శనివారం రాత్రి టీడీపీ అగ్రకుల మూకలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ నెల 5వ తేదీ పుష్పయాగం రోజు రాత్రి జైంట్‌ వీల్‌ వద్ద ఒంటిమిట్ట హరిజన వాడ యువకులకు– గంగపేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న కొత్తపల్లి గ్రామ యువకులకు మధ్య ఘర్షణ జరిగింది. చిన్నకొత్తపల్లికి చెందిన యువకులు దానిని అక్కడితో వదిలి పెట్టలేదు. గొడవతో ఎలాంటి సంబంధం లేని హరిత హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్‌కు చిన్నకొత్తపల్లికి చెందిన కట్టా మల్లికార్జున అనే వ్యక్తి ఫోన్‌ చేసి ‘హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసుకున్నాము. రూమ్‌ సర్వీస్‌ చేయాలి’ అంటూ పిలిచాడు. హోటల్‌ వద్దకు వెళ్లగానే హర్షవర్ధన్‌పై మల్లికార్జున, పలుకూరి కిరణ్‌, హేమంత్‌, కట్టా వేణు, కట్టా కిశోర్‌, కట్టా బాలకృష్ణ మూకుమ్మడిగా దాడి చేశారు. ‘మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి.. తరువాత అంతా మన టీడీపీ నాయకులు చూసుకుంటారు’ అంటూ కుల దూషణ చేస్తూ ముఖంపై రక్తం వచ్చేలా పిడి గుద్దులు గుద్దారు. నడుముపై క్రికెట్‌ బ్యాట్‌తో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో నడవలేని పరిస్థితిలో ఉన్న హర్షవర్ధన్‌ను స్థానికులు, బంధువులు వైద్యం కోసం స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు 108 సహాయంతో తరలించారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనతో కేసు నమోదు

విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట దళితవాడ, అరుంధతి వాడ ప్రజలు ఆదివారం బాధితుడితో కలిసి ఒంటిమిట్ట పోలీసుస్టేష న్‌ వద్దకు చేరుకున్నారు. న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు . స్టేషన్‌ బయట ఉన్న జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి వేసి, నిరసన తెలిపారు. ఎస్‌ఐ శ్రీనివాసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా, ప్రశాంతంగా ఉండే ఒంటిమిట్ట మండలంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజం పురుడు పోసుకుందని ప్రజలు విమర్శిస్తున్నారు. హర్షవర్ధన్‌పై దాడి చేసిన వారే గతంలో చెంచుగారిపల్లి వద్ద ఉన్న చిల్లర అంగడిని కూడా పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లు విమర్శలు ఉన్నాయి.

దళితునిపై టీడీపీ రౌడీ మూకల విచక్షణారహిత దాడి

వైఎస్సార్‌ కడప జిల్లా, ఒంటిమిట్టలో దారుణం

Advertisement
 
Advertisement
Advertisement