● పెట్రోల్ బంక్ స్థలం కొట్టేయడానికి యత్నాలు
● క్వారీలను కట్టబెట్టాలని బెదిరింపులు
● అల్లాడిపోతున్న అన్ని వర్గాలు
రాజంపేట : రాజంపేటలో టీడీపీ ముఖ్యనేత దందా యథేచ్ఛగా కొనుసాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆ నేత తీరు తెన్నులపై ఇక్కడ ప్రజానీకంలో చిన్నచూపు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపద సృష్టిస్తాననని పదేపదే ప్రచారం చేసుకుంటున్న తరుణంలో దోచుకుంటున్నారనే అపవాదును ఇక్కడి ముఖ్యనేత మూటకట్టుకున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు వెళుతున్నాయని అధికారపార్టీలో చర్చ జోరుగా కొనసాగుతోంది.
పురపాలిక పెట్రోలుబంక్ స్థలం కొట్టేసేందుకు ..
రాజంపేట నడిబొడ్డున ఉన్న పెట్రోల్‌బంకు నిర్వహణ పురపాలికస్థలంలో ఉన్నందుకు పురపాలికకు కేవలం రూ.1 అద్దె చెల్లిస్తూ కొన్నేళ్లుగా కొనసాగింది. రాజంపేటకు పురపాలిక సంఘానికి కమిషనరుగా ఫజులుల్లా వచ్చిన నేపథ్యంలో పెట్రోలు బంకు నిర్వహణ, స్ధలం వ్యవహారం వెలికి తీసారు. అప్పట్లో పెట్రోలు బంకు యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన కమిషనర్లు ఎవరూ పట్టించుకోలేదన్న వాదన పట్టణవాసుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం కౌన్సిల్ పురపాలిక స్థలంలో పెట్రోలు బంకు నిర్వహణపై దృష్టి సారించింది. పెట్రోలు బంక్ నిర్వహణను అడ్డుకున్నారు. అయినప్పటికీ దొడ్డిదారిలో నిర్వహణ కొనసాగుతోందని కౌన్సిల్‌లో ఆరోపించారు.అంతేకాకుండా పెట్రోలు బంకు స్థలంపై కొందరి కన్ను పడిందని కౌన్సిల్ మీట్‌లో ఆరోపించారు. పెట్రోలుబంకు స్థలం కోట్ల రూపాయిలు విలువ చేస్తుంది.దీనిని ముఖ్యనేత తమ తమ్ముళ్లుకు అప్పజెప్పాలనే యోచనలో ఇప్పటికే పావులు కదిపినట్లు ప్రచారం. ఇప్పుడు పురపాలికస్ధలాలు కాపాడుకోవాలనే యోచనలో పురపాలిక కౌన్సిల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
క్వారీలను కట్టబెట్టాలని.. బెదిరింపులు
మండలంలో కొందరి క్వారీలను తమకు కట్టబెట్టాలని సంబంధిత యజమానులపై బెదిరింపులు, ఒత్తిళ్లకు టీడీపీ ముఖ్యనేత దిగారు. చివరికి సంబంధిత మైన్స్ అధికారులను క్వారీ వద్దకు పంపించడం, లేని పోని ఆంక్షలు, నిబంధనలతో క్వారీ నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. క్వారీని కట్టబెట్టడమో, లేక ఆదాయంలో వాటాను ఇవ్వాలని రకరకాలుగా బెదిరింపులకు దిగుతున్నారు. అలాగే చెయ్యేరులో ఇప్పుడు నడుస్తున్న ఇసుక రీచ్‌లో ముఖ్యనేతకు వాటా ఇవ్వాల్సిందేనని ఇసుకరీచ్ నిర్వాహకులకు హుకుంజారీ చేశారు.
ఆదాయం కోసం పక్కదోవ..
నియోజకవర్గంలో టీడీపీ ముఖ్యనేత ఆదాయం కోసం పక్కదోవ పడుతున్నాడు. ప్రతిదానిలో కమిషన్ ఉండాల్సిందేనని టీడీపీలోని సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కొందరైతే నేరుగా చినబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యనేత చేతిలో నుంచి పగ్గాలను తీసేయాలని అధిష్టానానికి సీనియర్లు మొరపెట్టుకున్నారు. కేవలం ముఖ్యనేత వర్గమే నియోజకవర్గంలో చేపడుతున్న ఆధిపత్యాన్ని అన్ని సామాజికవర్గాలకు చెందిన తమ్ముళ్లు మదనపడుతున్నారు.


