పాలపిట్ట కథల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పాలపిట్ట కథల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

ప్రొద్దుటూరు కల్చరల్‌ : స్థానిక బీసీ ప్రజా చైతన్య సమాఖ్య కార్యాలయంలో ఆదివారం చైతన్య సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో పాలపిట్ట కథల ప్రత్యేక సంచిక –2026ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధాని, కవి నరాల రామారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలపిట్ట మాస పత్రిక వారు 51 కథల సంకలనంగా ఉగాది ప్రత్యేక సంచిక మార్చి –2026ను తెచ్చిన ప్రతిక ఎడిటర్‌ గుడిపాటి వెంకట్‌ను ప్రశంసించారు. వివిధ ప్రాంతాల్లోని ప్రసిద్ధ కథకుల కథలను తీసుకుని కథా సంకలనంగా తేవడం ద్వారా పాఠకులు వివిధ ప్రాంతాల సంస్కృతి ఆచార సంప్రదాయాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. పట్టణానికి చెందిన కథా రచయితలు కాశీవరపు వెంకటసుబ్బయ్య, పల్లా వెంకటరామారావు కథలు ఉండటం విశేషమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డీకే చదువుల బాబు కాశీవరపు వెంకటుబ్బయ్య రచించిన అల్లెంగుండు కథను సమీక్షించారు. రచయిత ఈ కథలో పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. రచయిత జింకా సుబ్రహ్మణ్యం పల్లా వెంకటరామారావు రచించిన దిద్దుబాటు కథనం సమీక్షించారు. ఈ కథలో పిల్లల దురాలవాట్లతో చెడిపోతున్నప్పుడు ఉపాధ్యాయుడు యుక్తిగా విద్యార్థులను చెడు అలవాట్ల నుంచి మాన్పించడం గొప్పగా ఉందన్నారు. ఈ సందర్భంగా కథా రచయితలు కాశీవరపు వెంకటసుబ్బయ్య, పల్లా వెంకటరామారావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయితలు పల్లా కృష్ణ, కొత్తపల్లి శీను, కామనూరు రామ్మోహన్‌, ఆవుల శ్రీనివాస్‌, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, కుంభం పామిలేటి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement